నైట్ మూవీ ప్లాన్ చేసుకున్నా, కట్ చేస్తే కెప్టెన్ నుంచి కాల్

ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ లో దుమ్మురేపిన భారత జట్టు వన్డే సిరీస్ నూ ఘనంగా ఆరంభించింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2025 | 06:03 PMLast Updated on: Feb 07, 2025 | 6:03 PM

I Have A Movie Night Planned But Got A Call From Captain

ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ లో దుమ్మురేపిన భారత జట్టు వన్డే సిరీస్ నూ ఘనంగా ఆరంభించింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. ఆల్ రౌండ్ షోతో ఇంగ్లీష్ టీమ్ ను నిలువరించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో విరాట్ కోహ్లీ లేకపోవడం పెద్ద షాక్ గానే భావించినా… మిగిలిన బ్యాటర్లలో గిల్ , శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ రాణించారు. అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్ అయ్యర్ చెలరేగిపోయాడు. రాత్రంతా మూవీ చూస్తూ ఎంజాయ్ చేద్దామనుకున్న అతను.. తర్వాతి రోజు మధ్యాహ్నం మైదానంలో అడుగుపెట్టి అదరగొట్టాడు. కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. మ్యాచ్ లో సత్తాచాటిన శ్రేయస్ కు అసలు తుది జట్టులో చోటే దక్కేది కాదు. కానీ కోహ్లి మోకాలి వాపు శ్రేయస్ కు వరంలా మారింది. దీంతో దొరికిన ఛాన్స్ ను అతను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. మిడిలార్డర్ లో తాను ఎంత కీలకమో చాటిచెప్పాడు.

నిజానికి ఈ మ్యాచ్ ముందురోజు వరకూ తుది జట్టులో కోహ్లీ ఉన్నాడు. శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, కేెఎల్ రాహుల్ ఉండటంతో తొలి వన్డేకు శ్రేయస్ ను పక్కనపెట్టాలని మేనేజ్ మెంట్ నిర్ణయించుకుంది. ఈ విషయం శ్రేయస్ కు కూడా తెలుసు కాబట్టి మ్యాచ్ ముందు రోజు రాత్రి మూవీ చూస్తూ రిలాక్స్ అవుతున్నాడు. కానీ ప్రాక్టీస్ సెషన్ చివర్లో కోహ్లీని మోకాలి గాయం ఇబ్బంది పెట్టింది. మోకాలు వాపుతో ఇబ్బంది పడ్డ కోహ్లి మ్యాచ్ ఆడే స్థితిలో లేడు. దీంతో ఆ రాత్రి సమయంలో కెప్టెన్ రోహిత్ వెంటనే శ్రేయస్ కు కాల్ చేశాడు. మ్యాచ్ లో ఆడాల్సి ఉంటుందని చెప్పడంతో వెంటనే హోటల్ గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. తర్వాతి రోజు మ్యాచ్ ఆడి హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. బెంచీపై కూర్చోవాల్సిన శ్రేయస్ అవకాశం రాగానే వచ్చి అర్ధశతకం బాదాడు. మంచి ప్రదర్శనతో జట్టును గెలుపు వైపు నడిపించాడు.

గత కొంతకాలంగా శ్రేయస్ వన్డేల్లో నిలకడగా రాణిస్తున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ లో 66.25 సగటుతో 468 పరుగులు చేసి భారత్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకూ 63 వన్డేల్లో 47.69 సగటుతో 2480 పరుగులు సాధించాడు. కానీ బీసీసీఐ చెప్పినా దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడంతో శ్రేయస్ సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయాడు. అప్పటి నుంచి ఆటపై మరింత ఫోకస్ పెట్టిన శ్రేయస్ తనను తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇదిలా ఉంటే రెండో వన్డేకు కోహ్లి అందుబాటులో వస్తే తుది జట్టులో శ్రేయాస్ కు చోటు దక్కుతుందా లేదా అనేది చూడాలి.