మళ్ళీ షేక్ ఆడిస్తా.. అభిషేక్ శర్మ ప్రాక్టీస్ షురూ

ఐపీఎల్ 18వ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిన్నటి వరకూ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లతో వన్డే ఫార్మాట్ ను ఎంజాయ్ చేసిన టీమిండియా ఫ్యాన్స్ కు ఇక రెండు నెలల పాటు ఐపీఎల్ వినోదం లభించనుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2025 | 02:55 PMLast Updated on: Mar 13, 2025 | 2:55 PM

I Will Play Shake Again Abhishek Sharma Starts Practice

ఐపీఎల్ 18వ సీజన్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిన్నటి వరకూ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లతో వన్డే ఫార్మాట్ ను ఎంజాయ్ చేసిన టీమిండియా ఫ్యాన్స్ కు ఇక రెండు నెలల పాటు ఐపీఎల్ వినోదం లభించనుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ సీజన్ మొదలుకానుండగా ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఐపీఎల్ లో గత ఏడాది రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఈ సారి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. పలువురు కీలక ఆటగాళ్ళను రిటైన్ చేసుకుని , వేలంలో స్టార్ ప్లేయర్స్ ను దక్కించుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త సీజన్ కోసం రెడీ అవుతోంది. సన్ రైజర్స్ జట్టులో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి కీలకం కానున్నాడు.

ఐపీఎల్ 2025 కోసం ప్రాక్టీస్‌లో మునిగిపోయిన అభిషేక్ శర్మ తన ఫేవరెట్ సిక్సర్లపైనే గురి పెట్టాడు. ప్రాక్టీస్ సెషన్‌లో భారీ సిక్సర్లు బాదేందుకే చూశాడు. ఈ సీజన్‌లో కూడా అభిషేక్ రాణించి సన్‌రైజర్స్‌ను ఫైనల్‌కు చేర్చాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గత సీజన్ లో ఓపెనర్‌గా అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టించాడు. తనదైన శైలిలో బౌలర్లను చితకబాది అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. క్రీజులో నిల్చున్నాడంటే బంతి బౌండరీ బయటకు వెళ్లాల్సిందే అన్నట్టు ఆడాడు. సిక్సర్లతో స్పిన్ బౌలర్లకు చుక్కలు చూయించాడు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనింగ్ భాగస్వామ్యంతో గత సీజన్‌లో సన్‌రైజర్స్ ఫైనల్స్‌కు చేరింది.

గత ఐపీఎల్ సీజన్‌లో అభిషేక్ శర్మ 16 ఇన్నింగ్స్‌లు ఆడి 484 పరుగులు చేశాడు. వ్యక్తిగత స్కోర్ 75తో మూడు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. అభిషేక్ శర్మ యావరేజ్ 32.27 కాగా స్ట్రయిక్ రేట్ మాత్రం 204.21గా ఉంది. లాస్ట్ సీజన్‌లో అభిషేక్ ఏకంగా 42 సిక్స్‌లు బాదాడ. ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో పదో స్థానంలో నిలిచాడు. ఈ ప్రదర్శనతోనే అభిషేక్ శర్మకి టీమిండియా టీ20 టీమ్‌లో చోటు దక్కింది. టీమిండియాలో అడుగుపెట్టిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసి తనేంటో నిరూపించుకున్నాడు. చివరగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ సెంచరీ బాదాడు. 17 టీ20 మ్యాచ్‌లలో 16 ఇన్నింగ్స్‌లు ఆడిన అభిషేక్ శర్మ 135 హైయెస్ట్‌తో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలతో 535 పరుగులు నమోదు చేశాడు. ఇదిలా ఉంటే వచ్చే సీజన్‌ కోసం అభిషేక్‌కు వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని సన్ రైజర్స్ యాజమాన్యం భావిస్తున్నట్టు తెలుస్తోంది.