ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 53 శాతం పెరిగిన ప్రైజ్‌మనీ
ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకాబోతోంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఈ మెగాటోర్నీ జరగబోతోంది.

ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకాబోతోంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఈ మెగాటోర్నీ జరగబోతోంది. భారత్ జట్టు పాక్ వెళ్ళి ఆడేందుకు ఒప్పుకోకపోవడంతో హైబ్రిడ్ మోడల్ లో టోర్నీ నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం భారత్ మ్యాచ్ లన్నీ దుబాయ్ లో జరగనుండగా.. మిగిలిన మ్యాచ్ లు పాక్ లోనే జరుగుతాయి. వన్డే ర్యాంకింగ్స్ లో తొలి 8 స్థానాల్లో ఉన్న జట్లు మాత్రమే ఈ టోర్నీలో ఆడతాయి.ప్రతీసారీ ఈ మెగా టోర్నీలో పోరు హోరాహోరీగా ఆసక్తికరంగా సాగుతుంటుంది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ వివరాలను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. గతంలో పోలిస్తే ప్రస్తుతం దాదాపు 53 శాతం ప్రైజ్ మనీని పెంచినట్లు తెలిపింది. విజేతగా నిలిచిన జట్టుకు 2.24 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కనుంది. అంటే భారత కరెన్సీలో 20.8 కోట్లు. రన్నరప్ గా నిలిచిన జట్టుకు 10.4 కోట్లు లభిస్తుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ టోటల్ ప్రైజ్ మనీ రూ.59.9 కోట్లలో ఒక్కో జట్టుకు వేర్వేరు మొత్తం దక్కుతుంది.సెమీఫైనల్ లో ఓడిపోయిన జట్లకు 5.20 కోట్లు.. గ్రూప్ దశలో గెలిచిన ప్రతి గెలుపుకు 29.5 లక్షలు లభిస్తాయి. ఐదవ, ఆరవ స్థానంలో నిలిచిన జట్లకు రూ.3.04 కోట్లు..ఏడు, ఎనిమిది స్థానంలో నిలిచిన జట్లకు 1.21 కోట్లు ప్రైజ్ మనీ దక్కుతుంది. 1996 తర్వాత పాకిస్తాన్ ఐసీసీ ఈవెంట్‌ను నిర్వహించడం ఇదే తొలిసారి. నాలుగు జట్లు చొప్పున రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. వన్డే ఫార్మాట్ లో టాప్ 8 జట్లు ఆడే ఈ టోర్నీపై భారీ హైప్ నెలకొంది. తొమ్మిదో ఎడిషన్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది.
2017 ఛాంపియన్స్ ట్రోఫీ తో పోలిస్తే ఈ సారి టోర్నీ ప్రైజ్ మనీని ఐసీసీ 53 శాతం పెంచింది. అయినప్పటికీ విన్నర్ కు దక్కే ప్రైజ్ మనీ ఐపీఎల్ లో పంత్, శ్రేయస్, వెంకటేశ్ పొందే శాలరీ కంటే తక్కువే. గత వేలంలో పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ 27 కోట్లకు, శ్రేయస్ ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు, వెంకటేశ్ ను కోల్ కతా నైట్ రైడర్స్ 23.75 కోట్లకు సొంతం చేసుకున్నాయి. దీంతో వీరి ఒక సీజన్ కు అందుకునే మొత్తం కంటే తక్కువ ప్రైజమనీనే ఐసీసీ విన్నర్ కు ఇవ్వబోతోంది. కాగా ఈ మెగాటోర్నీ కోసం టీమిండియా ఫిబ్రవరి 15న బయలుదేరబోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో భారత్ ఫిబ్రవరి 19న బంగ్లాదేశ్ తో తలపడుతుంది. తర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను ఫిబ్రవరి 23న ఢీకొంటుంది. చివరి లీగ్ మ్యాచ్ లో మార్చి 2న న్యూజిలాండ్ తో తలపడుతుంది.