World Cup Tickets: ఇండియాలో వరల్డ్ కప్ టికెట్స్ కోసం ఇలా చేయండి
వరల్డ్ కప్ సీజన్ ప్రారంభం కానుంది. టికెట్ల అమ్మకాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
భారత్ వేదికగా అక్టోబరు-నవంబరులో ఐసీసీ వన్డే ప్రపంచప్ 2023 జరగనుంది. ఈ మెగా టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ, బీసీసీఐ అధికారికంగా వెల్లడించాయి. టోర్నీ ఆరంభానికి 41 రోజుల ముందునుంచి ప్రేక్షకుల కోసం టికెట్లను అమ్మకానికి ఉంచాయి. అయితే వన్డే ప్రపంచప్ టికెట్లు కొనాలనుకునేవారు ఆగస్టు 15 నుంచి www.cricketworldcup.com పేజీలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకుంటే.. అందరికంటే ముందే టికెట్ల వివరాలు తెలుసుకోవచ్చు.
వన్డే ప్రపంచప్ 2023 మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలను ఐసీసీ రెండు రకాలుగా విభజించింది. భారత్ ఆడే వామప్, ప్రధాన మ్యాచ్‌లు.. భారత్ ఆడని ఇతర మ్యాచ్‌లు అని రెండు రకాలుగా టికెట్ల అమ్మకాలు ఉంటాయి. భారత్ ఆడే 9 లీగ్ మ్యాచ్‌ల టికెట్లు ఆరు వేర్వేరు దశల్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లు లేవన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌ల టికెట్లు ఆగస్టు 25న అమ్మకానికి ఉంటాయి. మెగా టోర్నీకి ఈ-టికెట్ ఆప్షన్ లేదని ఐసీసీ స్పష్టం చేసింది. అభిమానులు ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ కౌంటర్ల నుంచి టికెట్లను తీసుకోవాల్సిందే.