సేవ్ టెస్ట్ క్రికెట్ భారీ ఫండ్ ఏర్పాటు చేసిన ఐసీసీ
ప్రపంచ క్రికెట్ లో ప్రస్తుతం టీ ట్వంటీలదే హవా… గత కొంతకాలంగా టీ10 ఫార్మాట్ కూడా క్రేజ్ సంపాదించుకుంటోంది. అయితే ఈ ఫాస్ట్ ఫార్మాట్స్ కు అలవాటు పడిన ఫ్యాన్స్ సంప్రదాయ టెస్ట్ క్రికెట్ ను చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. అటు చాలా మంది స్టార్ ప్లేయర్స్ కూడా టీ ట్వంటీ లీగ్స్ పై మోజుతో టెస్ట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ ను బతికించుకోవడానికి ఐసీసీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఐదు రోజుల ఫార్మాట్ ను మళ్లీ గాడిలో పెట్టడానికి భారీగా ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం టెస్ట్ క్రికెట్ ను కాపాడుకునే క్రమంలో 125 కోట్ల రూపాయలతో ఫండ్ ఏర్పాటు చేయనుంది.
ఈ ఫండ్ లోని నిధులతో టెస్ట్ క్రికెట్ ఆడే ప్లేయర్స్ మ్యాచ్ ఫీజులను పెంచడంతోపాటు టీమ్స్ ను విదేశాలకు పంపేందుకు కూడా వీలవుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పలు దేశాల క్రికెట్ బోర్డులకు ఈ ఫండ్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఫండ్ ద్వారా టెస్ట్ క్రికెట్ ఆడే ప్రతి ప్లేయర్ కు కనీస వేతనం ఇవ్వాలని ఐసీసీ భావిస్తోంది. మ్యాచ్ ఫీజు 10 వేల డాలర్లుగా ఉంచాలని భావిస్తున్నట్లు సమాచారం. తమ టీమ్స్ ను విదేశాలకు పంపడానికి ఇబ్బంది పడుతున్న బోర్డులకు కూడా ఈ ఫండ్ నుంచే సాయం అందేలా ప్లాన్ చేస్తోంది. అయితే ఈ ఫండ్ ద్వారా ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లకు ఒరిగిదేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే బీసీసీఐ టెస్ట్ క్రికెట్ ఆడే ప్లేయర్స్ కు ప్రత్యేక ఫీజులు చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది.