World Cup 2023: ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇండియా-పాక్ మ్యాచ్ ఎప్పుడు..? హైదరాబాద్‌లో ఎన్ని మ్యాచులంటే..

అక్టోబర్ 5న ప్రపంచ కప్ తొలి మ్యాచ్ జరగనుండగా, నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడబోతుంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 27, 2023 | 02:29 PMLast Updated on: Jun 27, 2023 | 2:29 PM

Icc World Cup 2023 Schedule Released By Icc India Vs Pakistan On Oct 15

World Cup 2023: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. ప్రపంచ కప్-2023 షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. ఈసారి వరల్డ్ కప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వచ్చే అక్టోబర్, నవంబర్‌లో ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతుంది. అక్టోబర్ 5న ప్రపంచ కప్ తొలి మ్యాచ్ జరగనుండగా, నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇండియా తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడబోతుంది. అక్టోబర్ 8న చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. క్రికెట్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూసే ఇండియా-పాక్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో జరుగుతుంది.
హైదరాబాద్‌లో మ్యాచులు.. కానీ..
వరల్డ్ కప్‌ను పది వేదికలపై ఐసీసీ నిర్వహించబోతుంది. దీనికోసం ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పూణే, బెంగళూరు, అహ్మదాబాద్‌‌లో స్టేడియంలను సిద్ధం చేస్తోంది. టోర్నీ ప్రారంభానికి ముందు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు వామప్ మ్యాచులు జరుగుతాయి. వీటిని హైదరాబాద్, గువహటి, తిరువనంతపురంలో నిర్వహిస్తారు. హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో మూడు వరల్డ్ కప్ మ్యాచులు జరుగుతాయి. అక్టోబర్ 6, 9, 12న హైదరాబాద్‌లో మ్యాచులు జరుగుతాయి. ఇండియా ఈ టోర్నీలో కనీసం 9 మ్యాచులు ఆడుతోంది. అయితే, హైదరాబాద్‌లో ఇండియాకు సంబంధించిన మ్యాచులు మాత్రం లేకపోవడం నిరాశ కలిగించే అంశం. పాకిస్తాన్, న్యూజిలాండ్ మ్యాచులు మాత్రమే హైదరాబాద్‌లో జరుగుతాయి.
ఇండియా తొమ్మిది మ్యాచులు
ప్రపంచ కప్‌లో ఇండియా తొమ్మిది మ్యాచులు ఆడుతుంది. తొలి మ్యాచ్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో (చెన్నై), అక్టోబర్ 11న ఆఫ‌్గనిస్తాన్‌తో (ఢిల్లీ), అక్టోబర్ 15న పాకిస్తాన్‌తో (అహ్మదాబాద్‌), అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో (పూణే), అక్టోబర్ 22న న్యూజిలాండ్‌తో (ధర్మశాల), అక్టోబర్ 29న ఇంగ్లండ్‌తో (లక్నో), నవంబర్ 2 క్వాలిఫయర్‌2తో (ముంబై), నవంబర్ 5న దక్షిణాఫ్రికాతో (కోల్‌కతా), నవంబర్ 11 క్వాలిఫయర్ 1తో (బెంగళూరు) మ్యాచులు జరుగుతాయి. నవంబర్ 15న ముంబైలో సెమీఫైనల్ 1, నవంబర్ 16న కోల్‌కతాలో సెమీఫైనల్ 2 మ్యాచులు జరుగుతాయి. నవంబర్ 19 ఆదివారం అహ్మదాబాద్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డేలను కూడా కేటాయించారు. మొత్తం 46 రోజులపాటు సాగనున్న ఈ టోర్నీలో 48 మ్యాచులు జరుగుతాయి.