ICC WORLD CUP : ఆరోసారి వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా…. ఫైనల్లో ఘోరంగా విఫలమైన టీమిండియా !
కోట్ల మంది భారతీయుల కలలు కల్లలు అయ్యాయి. సొంత పిచ్ పై జరుగుతున్న ICC వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై ఫైనల్లో విజయం సాధించి కప్ గెలుచుకుంటుందని కోట్ల మంది ఇండియన్స్ ఆశలు పెట్టుకున్నారు. కానీ రోహిత్ సేన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్... ఇలా అన్ని విభాగాల్లోనూ పేలవమైన ఆటతీరును ప్రదర్శించి ... ఫైనల్లో ఘోరంగా ఓడి పోయింది. ఆరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా కప్ ను ఎగరేసుకుపోయింది.

Team India all out.. 241 runs target before Australia
కోట్ల మంది భారతీయులు కన్న కలలు ఒక్కసారిగా చెదిరిపోయాయి. స్వదేశంలో… సొంత పిచ్ లపై జరుగుతున్న ICC వరల్డ్ కప్ లో విజేతగా నిలుస్తుందనుకున్న టీమిండియా… ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో బొక్క బోర్లా పడింది. టోర్నీలో ప్రారంభం నుంచి వరుస విజయాలతో ఊరించిన రోహిత్ సేన… ఫైనల్ మ్యాచ్ లో చేతులెత్తేసింది. ఆరు వికెట్ల తేడాతో భారత్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయింది. టీమిండియా టార్గెట్ గా పెట్టిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా జట్టు కేవలం 3 వికెట్లు కోల్పోయి ప్రపంచ కప్ ను ఎగరేసుకుపోయింది. ట్రెవిస్ హెడ్ 120 బంతుల్లో 137 పరుగులు చేసి ఆ జట్టును విజయతీరాలకు చేర్చాడు. మరో క్రికెటర్ మార్నస్ లబుషేన్ 58 పరుగులు చేశాడు. ఇద్దరూ కలసి మూడో వికెట్ కు 194 పరుగుల పార్టనర్షిప్ అందించడంతో ఆసిస్ విజయం ఖాయమైంది. లీగ్ మ్యాచుల్లో మెరుపులు మెరిపించిన భారత బౌలర్లు ఫైనల్ మ్యాచ్ లో సత్తా చాటలేకపోయారు. బూమ్రా 2 వికెట్లు తీయగా, షమీ ఒక వికెట్ పడగొట్టాడు.
మొదట టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత క్రికెటర్లు పేలవమైన ఆటతీరును ప్రదర్శించారు. ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించారు. ఫీల్డింగ్ లోనూ అదరగొట్టారు. దాంతో టీమిండియా 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొదటి రెండు ఓవర్లలో రోహిత్ శర్మ… ఫోర్లు బాదడంతో 300 పైగానే స్కోర్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ టీమిండియాలో కేఎల్ రాహుల్ మాత్రమే 66 పరుగులతో టాప్ స్కోర్ చేశాడు. విరాట్ కోహ్లీ 54 పరుగులు, రోహిత్ శర్మ 47, రవీంద్రజడేజా 9, సూర్యకుమార్ 18, మహ్మద్ షమీ 6, బూమ్రా ఒకటి, కులదీప్ 10, సిరాజ్ 9 రన్స్ చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి భారత్ కు చెందిన మూడు కీలక వికెట్లు తీశాడు. హాజెల్ వుడ్, కమిన్స్ రెండేసి వికెట్లు తీశారు. మాక్స్ వెల్ ఒక వికెట్ పడగొట్టాడు. భారత్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ … మూడు విభాగాల్లోనూ ఫెయిల్ అవడంతో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఆస్ట్రేలియా ఇప్పటికి 6 సార్లు ప్రపంచ కప్ ను గెలుచుకుంది. గతంలో 1987లో మొదటిసారి … ఆ తర్వాత 1999, 2003, 2007,2015లోనూ విజేతగా నిలిచింది.