IDFC Bank: ఇంగ్లీష్ జట్లను తొక్కుకుంటా పోవాలే
ప్రస్తుతం అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ మరో జాక్ పాట్ కొట్టేసింది.

IDFC First Bank has signed an agreement with BCCI to be the title sponsor of the international matches played by India
క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం బీసీసీఐ హవా నడుస్తోంది. ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వడంతో బీసీసీఐ రాత పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు క్రికెట్ లో ఆధిపత్యం వహించిన క్రికెట్ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులకు చెక్ పెడుతూ బీసీసీఐ దూసుకువచ్చింది. ప్రస్తుతం అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ఉన్న బీసీసీఐ మరో జాక్ పాట్ కొట్టేసింది. ఇకపై భారత్ ఆడే ఒక్కో మ్యాచ్ ద్వారా ఏకంగా రూ. 4.20 కోట్లను ఆర్జించనుంది. స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్ లకు టైటిల్ స్పాన్సర్ గా ఉన్న మాస్టర్ కార్డ్ తప్పుకుంది. దాంతో బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ కోసం వేటను ఆరంభించింది. మూడేళ్ల కాలానికి గానూ స్వదేశంలో భారత్ ఆడే అంతర్జాతీయ మ్యాచ్ లకు టైటిల్ స్పాన్సర్ గా ఉండేందుకు ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయిన ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ బీసీసీఐతో ఒప్పందం చేసుకుంది.
ఈ మూడేళ్ల కాలానికి గానూ బీసీసీఐకి ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ భారీ మొత్తంలో చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. భారత పురుషుల జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్ ల కోసమే దాదాపుగా రూ. 235 కోట్లను ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చెల్లించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే మూడేళ్లలో స్వదేశంలో భారత్ 56 అంతర్జాతీయ మ్యాచ్ లను ఆడనుంది. ఆ లెక్కన ఒక్కో మ్యాచ్ కు ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ రూ. 4.20 కోట్లను బీసీసీఐకి చెల్లించనుంది. గతంలో మాస్టర్ కార్డ్ ఒక్కో మ్యాచ్ కు రూ. 3.80 కోట్లను ఒక్కో అంతర్జాతీయ మ్యాచ్ కు చెల్లించేంది. తాజాగా ఈ మొత్తం పెరిగిపోయింది. సెప్టెంబర్ నెలలో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే సిరీస్ తో బీసీసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ ఒప్పందం ఆరంభం కానుంది.