అరుదైన రికార్డు ముంగిట రోహిత్ కొడితే దిగ్గజాల రికార్డులు గల్లంతే

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ ప్రపంచకప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. టైటిల్ ఫేవరెట్లలో ముందున్న టీమిండియా తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 15, 2025 | 05:45 PMLast Updated on: Feb 15, 2025 | 5:45 PM

If Rohit Breaks A Rare Record The Records Of The Giants Will Be Lost

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మినీ ప్రపంచకప్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానుంది. టైటిల్ ఫేవరెట్లలో ముందున్న టీమిండియా తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడుతుంది. ఈ మెగాటోర్నీకి ముందు స్వదేశంలో ఇంగ్లాండ్ ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. తద్వారా ఫుల్ జోష్ తో ఛాంపియన్స్ ట్రోఫీకి రెడీ అయింది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ తో కీలక బ్యాటర్లంతా ఫామ్ లోకి వచ్చేశారు. దాదాపు ఏడాదికాలంగా ఫామ్ కోసం తంటాలు పడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వన్డేలో సెంచరీతో దుమ్మురేపాడు. మెగాటోర్నీలోనూ హిట్ మ్యాన్ ఇదే జోరు కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఈ క్రమంలో రోహిత్ ముందు అరుదైన రికార్డు ఎదురుచూస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ మరో 12 ప‌రుగులు చేస్తే.. వ‌న్డేల్లో 11వేల ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు. రోహిత్ శ‌ర్మ ఇప్ప‌టి వ‌ర‌కు 268 వ‌న్డేలు ఆడాడు. 260 ఇన్నింగ్స్‌ల్లో 49 స‌గ‌టుతో 10,988 ప‌రుగులు సాధించాడు. దీనిలో 32 సెంచరీలు, 57 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్ 11వేల ప‌రుగుల మైలురాయిని అందుకుంటే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయ‌ర్‌గా రికార్డులకెక్కుతాడు. ఈ క్ర‌మంలో స‌చిన్‌, గంగూలీ, పాంటింగ్ ల రికార్డు బ్రేక్ చేయ‌నున్నాడు. వ‌న్డేల్లో అత్యంత వేగంగా 11వేల ప‌రుగులు చేసిన జాబితాలో టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

కోహ్లీ 222 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌త అందుకున్నాడు. స‌చిన్ టెండూల్క‌ర్ 276 ఇన్నింగ్స్‌ల్లో, రికీ పాంటింగ్ 286 ఇన్నింగ్స్‌ల్లో , సౌర‌వ్ గంగూలీ 288 ఇన్నింగ్స్‌ల్లో, జాక్వెస్ క‌లిస్ 293 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయి సాధించారు. ఇక వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 9 మంది ఆట‌గాళ్లు మాత్ర‌మే 11వేల కంటే ఎక్కువ ప‌రుగులు చేశారు. వ‌న్డేల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో 18,426 ర‌న్స్‌తో స‌చిన్ టెండూల్క‌ర్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. సంగ‌క్క‌ర‌, విరాట్ కోహ్లీ, రికీ పాంటింగ్‌లు ఆ త‌రువాత వ‌రుస‌గా ఉన్నారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రోహిత్ 12 ప‌రుగులు చేస్తే వ‌న్డేల్లో ప‌ద‌కొండు వేల ప‌రుగులు సాధించిన ప‌దో ఆట‌గాడిగా నిలుస్తాడు.