India Vs West Indies: గ్రౌండ్ ఏదైనా బ్యాండ్ మనదే

దాదాపు నాలుగేళ్ల తర్వాత విండీస్‌ - భారత్ జట్ల మధ్య టెస్టు సిరీస్‌కు రంగం సిద్ధమైంది. చివరిసారిగా 2019లో విండీస్‌ పర్యటనకు టీమ్‌ఇండియా వెళ్లింది. గతేడాది భారత్‌కు విండీస్‌ వచ్చినా టెస్టు సిరీస్‌ ఆడలేదు. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమ్‌ఇండియా ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే, గత 21 ఏళ్ల కాలంలో ఇరు దేశాల మధ్య ఎనిమిది సిరీస్‌లు జరిగాయి. అన్నింటినీ టీమ్‌ఇండియానే గెలుచుకోవడం గమనార్హం. చివరిసారిగా భారత్‌పై వెస్టిండీస్‌ 2001/2002 సీజన్‌లో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఒక్కసారి కూడా విండీస్‌ గెలవలేకపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 12, 2023 | 05:54 PMLast Updated on: Jul 12, 2023 | 5:54 PM

In India Vs West Indies Matches Since Many Years Under The Leadership Of Sunil Gavaskar And Rahul Dravid India Has Been Getting The Upper Hand

ఇప్పటి వరకు ఇరు జట్లూ 98 టెస్టుల్లో తలపడగా విజయాల్లో భారత్ 22 కంటే విండీస్‌ 30 ఆధిపత్యంలో ఉంది. ఇక కరేబియన్‌ మైదానంలో 51 మ్యాచుల్లో ఆడగా.. విండీస్‌ 16 విజయాలు, భారత్ 9 విజయాలను నమోదు చేసింది. మరో 26 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. సిరీస్‌ల గణంకాల ప్రకారం.. విండీస్‌-భారత్‌ జట్ల మధ్య 24 టెస్టు సిరీస్‌లు జరిగాయి. ఇందులో 12 సిరీస్‌లను వెస్టిండీస్‌ సొంతం చేసుకోగా.. భారత్ 10 సిరీస్‌లను గెలుచుకుంది. మరో రెండు డ్రాగా ముగిశాయి. 2000వ సంవత్సరం ముందు వరకు విండీస్‌ ఆధిపత్యం ప్రపంచానికి తెలిసిందే. ఆ సమయంలో ఆ జట్టుపై విజయం సాధించడమంటే మాటలు కాదు. అయినా భారత్‌ రెండుసార్లు సిరీస్‌ను సొంతం చేసుకుంది.

కానీ, 2002/2003 సీజన్‌ నుంచి విండీస్‌తో ఆడిన అన్ని సిరీస్‌లను భారత్‌ గెలుచుకుంది. విండీస్‌ – భారత్ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీసుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్ కావడం విశేషం. మొత్తం 27 మ్యాచుల్లోని 48 ఇన్నింగ్స్‌ల్లో 65.45 సగటుతో 2,749 పరుగులు చేశాడు. గావస్కర్‌ తర్వాత క్లైవ్‌లాయిడ్ 28 టెస్టుల్లో 44 ఇన్నింగ్స్‌ల్లో 2,344 పరుగులు చేశాడు. అతడి సగటు 58.60. శివ్‌నారాయణ్‌ చంద్రపాల్ కూడా భారత్‌పై మంచి ఇన్నింగ్స్‌లే ఆడాడు. మొత్తం 25 టెస్టుల్లో 44 ఇన్నింగ్స్‌ల్లో 63.85 సగటుతో 2,171 పరుగులు చేశాడు.

ప్రస్తుత భారత క్రికెట్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ గతంలో విండీస్‌పైనా అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. 23 టెస్టుల్లోని 38 ఇన్నింగ్స్‌ల్లో 63.80 సగటుతో 1,978 పరుగులు సాధించాడు. డేంజరస్‌ బ్యాటర్ వివియన్‌ రిచర్డ్స్‌ కూడా టెస్టుల్లోనూ అదరగొట్టాడు. భారత్‌పై 28 టెస్టుల్లో 41 ఇన్నింగ్స్‌ల్లో 50.71 సగటుతో 1,927 పరుగులు చేశాడు. భారత దిగ్గజం కపిల్‌ దేవ్ 25 మ్యాచుల్లో 89 వికెట్లు పడగొట్టాడు. విండీస్‌ మాజీ పేసర్ మాల్కమ్ మార్షల్‌ 17 మ్యాచుల్లోనే 76 వికెట్లు తీసి భారత్‌ను బెంబేలెత్తించాడు. టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్ అనిల్‌ కుంబ్లే కూడా విండీస్‌పై భారీగానే వికెట్లు తీశాడు. కేవలం 17 మ్యాచుల్లోనే 74 వికెట్లు పడగొట్టాడు.