లైవ్ లో డిష్యూం.. డిష్యూం.. అక్తర్, షోయబ్ మాలిక్ గొడవ

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చెత్త ప్రదర్శన ఆ దేశ క్రికెట్ లో ప్రకంపనలు రేపుతోంది. ఫ్యాన్స్ తో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్ళు పాక్ క్రికెట్ బోర్డును తిట్టిపోస్తున్నారు. టీవీ షోల్లో సైతం పాక్ మాజీ క్రికెటర్ల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 1, 2025 | 05:50 PMLast Updated on: Mar 01, 2025 | 5:50 PM

In Live And Shoaib Malik Fight

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చెత్త ప్రదర్శన ఆ దేశ క్రికెట్ లో ప్రకంపనలు రేపుతోంది. ఫ్యాన్స్ తో పాటు ఆ దేశ మాజీ ఆటగాళ్ళు పాక్ క్రికెట్ బోర్డును తిట్టిపోస్తున్నారు. టీవీ షోల్లో సైతం పాక్ మాజీ క్రికెటర్ల తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒకానొక దశలో పాక్ మాజీ క్రికెటర్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేసుకుంటున్నాయి. తాజాగా షోయబ్ అక్తర్, షోయబ్ మాలిక్ ఓ రేంజ్ లో తిట్టుకున్నారు. పాక్ పరాజయంపై ఓ టీవీ ఛానెల్‌ లైవ్‌లో చర్చించిన షోయబ్ అక్తర్, షోయబ్ మాలిక్ గొడవపడ్డారు. ఇద్దరి మధ్య మాటల యుద్దం నడిచింది. ముందుగా అక్తర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌పై ఘాటైన విమర్శలు చేశాడు. రిజ్వాన్ లాంటి పిచ్చోడికి కెప్టెన్సీ ఇస్తే ఫలితాలు ఇలానే ఉంటాయన్నాడు.

తనకు పాకిస్థాన్ ఆటగాళ్లపై వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదన్నాడు. నిజం చెప్పాలంటే పాకిస్థాన్ జట్టు గురించి మాట్లాడాలని కూడా తనకు లేదన్నాడు. 2011 నుంచి పాకిస్థాన్ జట్టు ఏం చేయాలో చెబుతూనే ఉన్నాననీ గుర్తు చేశాడు. గత 14 ఏళ్లుగా పాక్ క్రికెట్ టీమ్ తిరోగమనంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. వింతైన ఆటగాళ్లను ఎంపిక చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయంటూ షోయబ్ అక్తర్ ఘాటుగా వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి గురైన షోయబ్ మాలిక్.. అక్తర్‌ను అడ్డుకున్నాడు. అంత కోపం ఉంటే.. నువ్వే పాకిస్థాన్ క్రికెట్‌ టీమ్‌లో చేరి అన్నీ చక్కదిద్దు అంటూ సలహా ఇచ్చాడు. ఇలా ఘాటుగా విమర్శించే బదులు జట్టును చక్కదిద్దే బాధ్యత తీసుకోమన్నాడు. ‘వెంటనే షోయబ్ అక్తర్ కూడా దీనికి ఘాటుగా బదులిచ్చాడు.

పాకిస్థాన్ జట్టు కోసం పని చేసేందుకు తాను సిద్దంగా ఉన్నట్టు ప్రకటించాడు. జట్టు కోసం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేస్తాననీ చెప్పాడు. పాకిస్థాన్ జట్టు బాధ్యతలను అప్పగించమన్నాడు. తన కుటుంబాన్ని వదిలి పాకిస్థాన్ జట్టు కోసం పనిచేసేందుకు సిద్దంగా ఉన్నాననీ, మూడేళ్ల తర్వాత తన భవితవ్యం ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసన్నాడు. అయినా కూడా తాను రెడీ అంటూ సవాల్ విసిరాడు. వీరిద్దరి వాగ్వాదం చేయిదాటే పరిస్థితికి వెళుతుండడంతో జోక్యం చేసుకున్న మరో మాజీ క్రికెటర్ మహ్మద్ హఫీజ్. మిమ్మల్ని మూడేళ్ల పాటు పనిచేయనిస్తారా అంటూ ప్రశ్నించాడు. దీంతో అందరూ నవ్వేశారు. పాక్ సెమీస్ చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం పాకిస్థాన్‌కు రాగా.. ఆ జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టడం.. ఆ టీమ్ ఫ్యాన్స్‌తో పాటు మాజీ ఆటగాళ్లను తీవ్రంగా నిరాశపర్చింది. దాంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు.మహమ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని పాకిస్థాన్‌ జట్టుపై ఘాటైన విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్థాన్ జట్టును పూర్తి ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.