Team India: అసలే మనోళ్లు గొప్ప ఫిట్ నెస్ వీరులు 9 మ్యాచులు 9 స్టేడియాల్లో షెడ్యుల్

వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైందని ఫ్యాన్స్ అంతా సంతోషిస్తున్నారు. కానీ ఈ షెడ్యూల్ వల్ల టీమిండియా కొంప మునిగేలా ఉంది. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 1, 2023 | 04:01 PMLast Updated on: Jul 01, 2023 | 4:01 PM

In Odi World Cricket India Has To Travel To Nine Places For 9 Matches So Fans Are Worried That How Will They Travel And Play The Match

ఈ క్రమంలోనే మొత్తం 10 వేదికలను ఈ టోర్నీ కోసం బీసీసీఐ సెలెక్ట్ చేసింది. వీటిలో అన్ని జట్లు కొన్ని స్టేడియాల్లో రెండేసి మ్యాచులు ఆడుతున్నాయి. కానీ భారత్ మాత్రం తాను ఆడే 9 మ్యాచులను 9 వేరు వేరు వేదికల్లో ఆడనుంది. ఇన్ని స్టేడియాల మధ్య ప్రయాణిస్తూ.. ఇన్ని చోట్ల ఆడే ఒకే ఒక జట్టు టీమిండియా. ఈ క్రమంలో కేవలం వరల్డ్ కప్ లీగ్ దశలోనే భారత జట్టు ఏకంగా 8400 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. కొన్ని సమయాల్లో అయితే రెండు, మూడు రోజుల గ్యాప్‌లోనే చాలా దూరం ప్రయాణించి రెండు మ్యాచులు ఆడాల్సి వస్తోంది. లీగ్ దశలో కేవలం 34 రోజుల్లో భారత జట్టు 8400 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది.

ఒక్క హైదరాబాద్‌లో తప్ప మిగతా అన్ని వేదికల్లో టీమిండియా మ్యాచులు ఉన్నాయి. ఇవి కాక, గువాహతి, త్రివేండ్రంలో వార్మప్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇవి వరల్డ్ కప్ ప్రయాణాలకు అదనం. టోర్నీలో తొలి మ్యాచ్‌ను చెన్నైలో ఆడే భారత్.. అక్కడి నుంచి రెండో మ్యాచ్ కోసం ఢిల్లీ వెళ్లాలి. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఏకంగా 1761 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. ఇక ఆ తర్వాత మళ్లీ పూణేలో బంగ్లాదేశ్‌ను ఎదుర్కొని, అక్కడి నుంచి ధర్మశాలకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ కివీస్‌తో టీమిండియా తలపడనుంది. ఈ రెండు మ్యాచుల మధ్య కేవలం మూడు రోజులే గ్యాప్ ఉంది. కీలకమైన కివీస్ మ్యాచ్ ముందు ఆటగాళ్లు ప్రయాణ బడలికతో ఉంటే ఎలా ఆడతారో అని ఫ్యాన్స్ టెన్షన్ పడటంలో తప్పులేదు.

ఇక చివరి దశలో వరుసగా ముంబై నుంచి కోల్‌కతా, అక్కడి నుంచి బెంగళూరుకు టీమిండియా వెళ్లాల్సి ఉంటుంది. అంటే లీగ్ దశలో తమ చివరి మూడు మ్యాచులు ఆడేందుకు భారత జట్టు ఏకంగా 3100 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. టోర్నీలో మిగతా జట్లు కొన్ని నగరాల్లో వారం రోజులపాటు ఉండే ఛాన్స్ ఉంది. దీంతో వాళ్లు చక్కగా విశ్రాంతి తీసుకోవడంతోపాటు.. అక్కడి పిచ్‌ను కూడా బాగా అర్థం చేసుకోగలుగుతారు. భారత్‌కు మాత్రం ఆ అవకాశం లేదు. ఇదంతా తెలిసిన ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఎంత ఆతిథ్య దేశం అయితే మాత్రం.. ఇంత దారుణంగా షెడ్యూల్ ఎలా సిద్ధం చేస్తారని, భారత ఆటగాళ్లకు విశ్రాంతి అక్కర్లేదా? అని నిలదీస్తున్నారు. ఒకవేళ భారత్ కనుక వరల్డ్ కప్ గెలవలేకపోతే.. ఈ షెడ్యూల్ కూడా ఒక కారణమే అవుతుందని మండిపడుతున్నారు. బుద్ధి లేకుండా ఇలా షెడ్యూల్ ఎలా సిద్ధం చేశారని ప్రశ్నిస్తున్నారు.