IND Vs WI ODI: మొదటి పంచ్ మనదే.. చక్రం తిప్పిన భారత్.. విండీస్‌పై ఘనవిజయం
ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. గురువారం ఏకపక్షంగా సాగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.
IND Vs WI ODI: వెస్టిండీస్ గడ్డపై భారత జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. గురువారం ఏకపక్షంగా సాగిన తొలి వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది.
భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా 37 పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, మరో స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించారు. భారత స్పిన్నర్లకు తోడుగా హార్దిక్ పాండ్యా, ముకేష్ కుమార్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీసారు. విండీస్ బ్యాటర్లలో షై హోప్ 45 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 43 పరుగులు మాత్రమే చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు అంతా విఫలమయ్యారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలుపొందింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 52 పరుగులతో హాఫ్ సెంచరీతో రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో గుడకాషే మోతీ రెండు వికెట్లు, యాన్నిక్ కారయ్య, జయడేన్ సీల్స్ తలో వికెట్ తీసారు. స్వల్ప లక్ష్యచేధనలో టీమిండియాకు శుభారంభం దక్కలేదు.
రోహిత్ శర్మకు బదులుగా ఇషాన్ కిషన్‌తో బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ 7 పరుగులతో తన వైఫల్యాన్ని కొనసాగించాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ రాగా.. ఇషాన్ కిషన్ ధాటిగా ఆడాడు. ఈ ఇద్దరూ నిలకడగా ఆడటంతో పవర్ ప్లేలో భారత్ వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. అనంతరం విండీస్ కెప్టెన్ షై హోప్, స్పిన్నర్లను రంగంలోకి దింపగా.. సూర్యకుమార్ యాదవ్ 19 రన్స్ వద్ధ ఎల్బీగా వెనుదిరిగాడు.
అనంతరం హార్దిక్ పాండ్యా 5 పరుగుల వద్ద రనౌటవ్వగా.. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇషాన్ కిషన్‌ను గుడకేష్ మోతీ ఔట్ చేశాడు. క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ కూడా విఫలమవ్వడంతో రంగంలోకి దిగిన రోహిత్ శర్మ 12 పరుగులతో, రవీంద్ర జడేజా 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు విజయాన్ని అందించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే జూలై 29, శనివారం జరగనుంది.