దుమ్ము రేపాల్సిందే బంగ్లాతో భారత్ తొలి టీ20
భారత్,బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ ల టీ ట్వంటీ సిరీస్ కు ఆదివారం నుంచే తెరలేవనుంది. టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా మరోసారి ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. పలువురు సీనియర్ క్రికెటర్లు, స్టార్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇవ్వడంతో యువ ఆటగాళ్ళకు చోటు దక్కింది.
భారత్,బంగ్లాదేశ్ మూడు మ్యాచ్ ల టీ ట్వంటీ సిరీస్ కు ఆదివారం నుంచే తెరలేవనుంది. టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా మరోసారి ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. పలువురు సీనియర్ క్రికెటర్లు, స్టార్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇవ్వడంతో యువ ఆటగాళ్ళకు చోటు దక్కింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని యంగ్ ఇండియాకు ఈ సిరీస్ మంచి అవకాశంగా చెప్పొచ్చు. 2026 టీ ట్వంటీ ప్రపంచకప్ కు ఇప్పటి నుంచే కోర్ టీమ్ ను సిద్ధం చేస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్ పక్కా ప్లాన్ తో రెడీ అయ్యాడు. షార్ట్ ఫార్మేట్ కావడంతో ఏ జట్టునూ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. అయితే సొంతగడ్డపై భారత్ ఫేవరెట్ కావడంతో సిరీస్ లో ఆరంభం అదిరిపోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జైశ్వాల్ , గిల్ కు రెస్ట్ ఇవ్వడంతో సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించనున్నారు. జింబాబ్వే టూర్ లో సెంచరీతో దుమ్మురేపిన అభిషేక్ శర్మపై మరోసారి అంచనాలున్నాయి. మరోవైపు ఐపీఎల్ మెగా వేలం కూడా వచ్చే నెలలో ఉండడంతో ఫ్రాంచైజీల దృష్టిలో పడేందుకు యువ ఆటగాళ్ళకు గోల్డెన్ ఛాన్స్ గా చెప్పొచ్చు.
వన్ డౌన్ లో సూర్యకుమార్ యాదవ్ రానుండగా… రియాన్ పరాగ్, రింకూసింగ్ లలో ఒకరికి చోటు దక్కనుంది. ఆల్ రౌండర్ పాండ్యా దాదాపు రెండు నెలల విరామం తర్వాత మళ్ళీ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. అలాగే మరో ఆల్ రౌండర్ శివమ్ దూబే కూడా సత్తా చాటేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. దీంతో నితీశ్ కుమార్ రెడ్డికి తొలి మ్యాచ్ కు తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. స్పిన్ విభాగంలో వాషింగ్టన్ సుందర్ , రవి బిష్ణోయ్ కీలకం కానుండగా.. పేస్ ఎటాక్ ను అర్షదీప్ సింగ్ లీడ్ చేయనున్నాడు. మరో ఇద్దరు పేసర్లుగా హర్థిత్ రాణా, మయాంక్ యాదవ్ కు చోటు దక్కనుంది. కాగా మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న గ్వాలియర్ లో 14 ఏళ్ళ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతోంది. ఇక్కడ టీ ట్వంటీ జరగనుండడం ఇదే తొలిసారి. గత రికార్డుల పరంగా భారత్ దే పై చేయిగా ఉంది. ఇరు జట్లు 13 మ్యాచ్ లలో తలపడితే 12 సార్లు భారత్ గెలిచింది. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న గ్వాలియర్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నారు.