దమ్ముంటే కాస్కోండి ఈ సారి మీకు చుక్కలే
ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో భారత్ దూసుకెళుతోంది. హ్యాట్రిక్ విజయాలతో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ సెమీఫైనల్లో అడుగుపెట్టిన రోహిత్ సేన ఇక టైటిల్ కు రెండడుగుల దూరంలో నిలిచింది.

ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ వేటలో భారత్ దూసుకెళుతోంది. హ్యాట్రిక్ విజయాలతో తిరుగులేని ఆధిపత్యం కనబరుస్తూ సెమీఫైనల్లో అడుగుపెట్టిన రోహిత్ సేన ఇక టైటిల్ కు రెండడుగుల దూరంలో నిలిచింది. కానీ సెమీస్ లో ప్రధానమైన అడ్డంకి ఆస్ట్రేలియానే… వరల్డ్ క్రికెట్ లో భారత్ లానే టాప్ టీమ్ గా ఉన్న కంగారూలతో భారత్ సెమీఫైనల్లో తలపడబోతోంది. ఆస్ట్రేలియాతో ఎప్పుడు మ్యాచ్ జరిగినా ఇరు జట్ల మధ్య పోటీ ఓ రేంజ్ లో ఉంటుంది. పైగా 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి కంగారూలపై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఎదురుచూస్తోంది. ఇప్పుడు ఆ అవకాశం రానే వచ్చింది. సెమీస్ లో దెబ్బకు దెబ్బ తీసి ఆసీస్ ను ఇంటికి పంపించేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సెమీఫైనల్ కు సంబంధించి రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.
న్యూజిలాండ్ పై గెలిచిన తర్వాత మాట్లాడిన రోహిత్ కంగారూల ఛాలెంజ్ కు సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. ఐసీసీ టోర్నీల్లో ఆస్ట్రేలియా బాగా ఆడుతున్న జట్టుగా అందరికీ తెలుసన్నాడు. ఈ సారి కూడా కమ్మిన్స్, స్టార్క్, హ్యాజిల్ వుడ్ లాంటి స్టార్ పేసర్లు లేకున్నా కూడా కంగారూలు సత్తా చాటుతున్నారని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో భారత్ రికార్డును కూడా మరిచిపోవద్దన్నాడు. ప్రతీ మ్యాచ్ నూ ఛాలెంజింగ్ గానే తీసుకుంటూ ఆడుతున్నామని చెప్పాడు. సెమీస్ లో సహజంగా ఉండే ఒత్తిడిని తట్టుకుని ఆరోజు బాగా ఆడితే గెలుపు తమదేని రోహిత్ వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మాత్రం హోరాహోరీగా సాగడం ఖాయమని భారత కెప్టెన్ తేల్చేశాడు.
ఇదిలా ఉంటే కివీస్ పై వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్ల పెర్ఫార్మెన్స్ రోహిత్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎందుకంటే కివీస్ తో మ్యాచ్ కోసం హర్షిత్ రాణాను తప్పించి వరుణ్ ను తీసుకున్నారు. వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న వరుణ్ చక్రవర్తి మిడిలి ఓవర్స్ లో తన స్పిన్ మ్యాజిక్ ను చూపించి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో సెమీఫైనల్ లో ఆసీస్ పై భారత బౌలింగ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఒకవిధంగా ఫైనల్ ఎలెవన్ ఎంపిక ఇప్పుడు మరింత తలనొప్పిగా ఉన్నప్పటకీ జట్టులో ఇటువంటి పరిస్థితి ఉండడం మేలు చేస్తుందన్నాడు. మళ్ళీ హర్షిత్ ను జట్టులోకి తీసుకుంటే నలుగురు స్పిన్నర్లలో ఎవరిని తప్పిస్తారనేది చూడాలి. ఎందుకంటే స్పిన్నర్లందరూ అద్భుతంగా రాణిస్తున్నారు. దుబాయ్ పిచ్ కావడంతో స్లో బౌలర్లే కీలకం. దీంతో తుది జట్టు హర్షిత్ కంటే వరుణ్ నే కొనసాగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.