గత రికార్డుల్లో పాక్ దే పైచేయి రివేంజ్ కోసం భారత్ రెడీ

భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట కాదు అంతకుమించి... ఆటతో పాటే భావోద్వేగాల సమరం... స్టేడియం అంతా హౌస్ ఫుల్ అయిపోతుంది... రెండు దేశాల్లోనూ ఆ రోజు అనధికార సెలవుగా కనిపిస్తుంది...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2025 | 06:45 PMLast Updated on: Feb 18, 2025 | 6:45 PM

India Is Ready For Revenge For Pakistans Upper Hand In Past Records

భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట కాదు అంతకుమించి… ఆటతో పాటే భావోద్వేగాల సమరం… స్టేడియం అంతా హౌస్ ఫుల్ అయిపోతుంది… రెండు దేశాల్లోనూ ఆ రోజు అనధికార సెలవుగా కనిపిస్తుంది… కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులకు కంపెనీలు సెలవులు కూడా ఇస్తుంటాయి.. ప్రధాని నుంచి సగటు అభిమాని వరకూ టీవీ సెట్లకు అతుక్కుపోయి మరీ మ్యాచ్ ను చూస్తుంటారు.. ఇదీ భారత్,పాక్ మ్యాచ్ కు ఉండే క్రేజ్.. కానీ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తెగిపోవడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే చిరకాల ప్రత్యర్థుల మధ్య క్రికెట్ సమరం జరుగుతోంది. అందుకే ఈ క్రేజ్ రెట్టింపయింది. ఇప్పుడు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ వేదికగా భారత్ , పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరకాల ప్రత్యర్థుల సమరానికి మరో వారం రోజులే సమయమున్న నేపథ్యంలో గత రికార్డులను ఒకసారి గుర్తు చేసుకుందాం.

ఐసీసీ టోర్నీల్లో ఓవరాల్ గా పాకిస్తాన్ పై భారత్ దే పైచేయిగా ఉంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పాక్ జట్టుదే ఆధిపత్యం. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇరు జట్లు ఐదుసార్లు తలపడితే మూడుసార్లు పాకిస్తాన్, రెండుసార్లు భారత్ గెలిచాయి. 2004 ఛాంపియన్స్ ట్రోఫీ ఎడిషన్ లో ఇరు జట్లు తొలిసారి తలపడినప్పుడు పాకిస్తాన్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. అలాగే 2009లోనూ మరోసారి పాక్ జట్టు పైచేయి సాధించింది. మన బ్యాటింగ్ వైఫల్యంతో పాక్ జట్టు 54 రన్స్ తేడాతో గెలిచింది. అయితే 2013లో మాత్రం పాక్ ను భారత్ గట్టిగానే దెబ్బకొట్టింది. 8 వికెట్ల తేడాతో దాయాది జట్టును ఓడించి రివేంజ్ తీర్చుకుంది. తర్వాత 2017 ఛాంపియ‌న్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో టీమిండియా రెండు సార్లు త‌ల‌ప‌డింది. గ్రూప్ స్టేజ్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో టీమిండియా విజేత‌గా నిల‌వ‌గా…ఫైన‌ల్‌లో మాత్రం భార‌త జ‌ట్టును చిత్తు చేసి పాకిస్థాన్ టైటిల్ ఎగ‌రేసుకుపోయింది.

గ్రూప్ స్టేజ్‌లో జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 124 ప‌రుగులు తేడాతో టీమిండియా విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ 91 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. విరాట్ కోహ్లి 81 ర‌న్స్‌, శిఖ‌ర్ ధావ‌న్ 68 ప‌రుగులు, యువ‌రాజ్ సింగ్ 58 ర‌న్స్‌ తో రాణించ‌డంతో టీమిండియా 50 ఓవర్లలో 3 వికెట్లు మాత్ర‌మే న‌ష్ట‌పోయి 319 ప‌రుగులు చేసింది. వ‌ర్షం కార‌ణంగా పాకిస్థాన్ ల‌క్ష్యాన్ని 41 ఓవ‌ర్ల‌లో 289 ప‌రుగుల‌కు కుదించారు. భార‌త బౌల‌ర్ల జోరుతో పాకిస్థాన్ 33 ఓవ‌ర్ల‌లో 164 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఉమేష్ యాద‌వ్ 3, హార్దిక్ పాండ్య‌, ర‌వీంద్ర జ‌డేజా త‌లో రెండు వికెట్ల‌తో పాకిస్థాన్‌ను దెబ్బ‌కొట్టారు.

అయితే 2017 ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో మాత్రం సీన్ రివ‌ర్స్ అయ్యింది. టీమిండియాను చిత్తు చేసి పాకిస్థాన్ క‌ప్పు సొంతం చేసుకుంది. ఫైన‌ల్‌లో తొపాకిస్థాన్ 338 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో భార‌త బ్యాటర్లు చేతులెత్తేశారు. రోహిత్ శ‌ర్మ‌, కోహ్లి, ధోనీ సింగిల్ డిజిట్‌కు ప‌రిమిత‌మ‌య్యారు. 30 ఓవ‌ర్ల‌లో టీమిండియా 158 ప‌రుగుల‌కే ఆలౌటైంది. హార్దిక్ పాండ్య 46 బాల్స్‌లో 76 ప‌రుగుల‌తో చెల‌రేగ‌డంతో టీమిండియా ఈ మాత్ర‌మైనా స్కోరు చేయ‌గ‌లిగింది. పాకిస్థాన్ చేతిలో 180 ప‌రుగుల‌తో తేడాతో టీమిండియా ఓట‌మి పాలైంది. ఇప్పుడు ఆరోసారి ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ తో తలపడనున్న భారత్ రివేంజ్ తీర్చుకునేందుకు ఎదురుచూస్తోంది.