ఎదురులేని శివంగులు వరల్డ్ కప్ కు అడుగేదూరం
మహిళల అండర్ 19 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన భారత అమ్మాయిలు వరల్డ్ కప్ కు అడుగుదూరంలో నిలిచారు. ఊహించినట్టుగానే సెమీస్ లో భారత్ పూర్తిగా డామినేట్ చేసింది.
మహిళల అండర్ 19 ప్రపంచకప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ దుమ్మురేపుతోంది. వరుస విజయాలతో ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన భారత అమ్మాయిలు వరల్డ్ కప్ కు అడుగుదూరంలో నిలిచారు. ఊహించినట్టుగానే సెమీస్ లో భారత్ పూర్తిగా డామినేట్ చేసింది. ఇంగ్లాండ్ ధాటిగానే ఇన్నింగ్స్ ఆరంభించినా భారత బౌలర్లు కట్టడి చేశారు. కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ లో పట్టుబిగించారు. పిచ్ నుంచి వచ్చిన సపోర్ట్ తో మన స్పిన్నర్లు చెలరేగిపోయారు. పరునికా సిసోడియా , వైష్ణవి శర్మ చెరొక ఎండ్ నుంచి అద్భుతమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ జోరుకు బ్రేకులు వేశారు. వీరిద్దరూ చెరో మూడేసి వికెట్లు పడగొట్టగా… ఆయుషి శుక్లా రెండు వికెట్లు తీసింది. దీంతో ఇంగ్లాండ్ 113 పరుగులకే పరిమితమైంది. డెత్ ఓవర్లలోనూ మన బౌలర్లు ఇంగ్లాండ్ కు అవకాశమివ్వలేదు.
ఛేజింగ్ లో ఓపెనర్లు కమలిని, తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష అదరగొట్టారు. గత మ్యాచ్ లో స్కాట్లాండ్‌పై 59 బంతుల్లో అ110 పరుగులు చేసినత్రిష మరోసారి మెరుపులు మెరిపించింది. 29 బంతుల్లో 5 ఫోర్లతో 35 పరుగులు చేసింది. త్రిష ఔటైనప్పటకీ కమలిని దూకుడుగా ఆడింది. 47 బంతుల్లో హాఫ్ సెంచరీ చేయడంతో భారత్ 15 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. మన బ్యాటర్ల జోరుతో మ్యాచ్ వన్ సైడ్ గా మారిపోయింది. 9 వికెట్ల తేడాతో గెలిచిన భారత జట్టు ఫైనల్లో సౌతాఫ్రికాతో తలపడుతుంది. అంతకముందు జరిగిన మరో సెమీస్ లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను నిలువరించింది.
ఇదిలా ఉంటే మరోసారి అండర్ 19 వరల్డ్ కప్ గెలిచేందుకు భారత అమ్మాయిలు అడుగుదూరంలో ఉన్నారు. ఈ టోర్నీ ఆరంభం నుంచి ఓటమే లేకుండా ఫైనల్ కు దూసుకొచ్చాడు. గ్రూప్ దశలో వెస్టిండీస్, మలేసియాలను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన భారత్.. శ్రీలంకను 60 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సూపర్ సిక్స్‌లో బంగ్లాదేశ్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో, స్కాట్లాండ్‌పై 150 పరుగుల తేడాతోనూ గెలిచింది. ఇప్పుడు ఇంగ్లాండ్ ను చిత్తు చేసిన భారత్ మరోసారి వరల్డ్ కప్ గెలుచుకునేందుకు సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఆదివారం జరిగే ఫైనల్లోనూ భారత జట్టే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.