India vs Pakistan: కోహ్లీ, రాహుల్ సెంచరీలు.. చితక్కొట్టిన భారత్.. పాక్‌పై అత్యధిక స్కోరు..!
కోహ్లీ 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 122 పరుగులు సాధించిన నాటౌట్‌గా నిలిచారు. కేఎల్ రాహుల్ 100 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 106 బంతుల్లో 111 పరుగులతో రాహుల్ నాటౌట్‌గా ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు ఉండటం విశేషం.
India vs Pakistan : పాకిస్తాన్‌పై జరుగుతున్న సూపర్-4 మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. పాకిస్తాన్‌పై అత్యధిక స్కోరు 356 పరుగులు సాధించింది. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగిపోయారు. 147/2 వికెట్ల స్కోరుతో రిజర్వ్ డే రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా భారీ స్కోరు సాధించడం విశేషం. ఆదివారం నాటి ఆటకు కొనసాగింపుగా బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. కోహ్లీ 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 122 పరుగులు సాధించిన నాటౌట్‌గా నిలిచారు. కేఎల్ రాహుల్ 100 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 106 బంతుల్లో 111 పరుగులతో రాహుల్ నాటౌట్‌గా ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 2 సిక్సర్లు ఉండటం విశేషం. ఇన్నింగ్స్ 50 ఓవర్లు ముగిసే సయమానికి భారత్ 356/2 పరుగులు సాధించింది. ఇది పాక్‌పై వన్డేల్లో భారత అత్యధిక స్కోరు. అయితే, ఇదే మొదటిసారి కాదు. 2005లో విశాఖపట్నంలో జరిగిన మ్యాచులో కూడా పాక్‌పై ఇండియా 9 వికెట్ల నష్టానికి 356 పరుగులే చేసింది. ఈ సారి కూడా అదే పరుగులు సాధించింది.
ఫామ్‌లోకొచ్చిన కోహ్లీ, రాహుల్
ఈ ఇన్నింగ్సులో చెప్పుకోవాల్సింది భారత బ్యాటర్ల గురించే. పాక్‌తో జరిగిన మొదటి మ్యాచులో ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా మినహా మిగతా బ్యాటర్లు విఫలమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచులో ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ, రాహుల్ సెంచరీలు సాధించారు. ఈ ఇద్దరూ కొంతకాలంగా స్థాయికి తగ్గట్లు ఆడకుండా విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రాహుల్‌ను ఎంపిక చేయడంపైనే విమర్శలొచ్చాయి. కానీ, తాజా సెంచరీతో వాటికి రాహుల్ గట్టి బదులిచ్చాడు. ఇక కోహ్లీ కూడా చాలా రోజుల తర్వాత సెంచరీ సాధించి, ఫామ్‌లోకి రావడం మరో విశేషం. వరల్డ్ కప్‌కు ముందు బ్యాటర్లు ఫాంలోకి రావడం శుభ పరిణామం. బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న పాక్ బౌలర్లను మన బ్యాటర్లు ఎదుర్కొన్న తీరు అమోఘం.
కోహ్లీ రికార్డ్
ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లో 13,000 పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ. అది కూడా అతి తక్కువ ఇన్నింగ్సుల్లో కావడం విశేషం. 47వ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ.. 258 వన్డేల్లోనే 13 వేల పరుగులు పూర్తి చేసుకోవడం విశేషం.