India Vs West Indies: అబ్బాయిలు అరుస్తారా? మెరుస్తారా?
టెస్టుల్లో చిన్న జట్లకు కూడా పోటీ ఇచ్చే స్థితిలో లేని వెస్టిండీస్.. టీమ్‌ఇండియా ధాటికి ఏమాత్రం నిలవలేదన్నది అందరూ ఊహించిన విషయమే.

India should be cautious while playing T20 match against West Indies
ఆ అంచనాకు తగ్గట్లే ఏకపక్షంగా సాగింది టెస్టు సిరీస్. కానీ వన్డేలకు వచ్చేసరికి కరీబియన్ జట్టు నుంచి కొంత పోటీ కనిపించింది. ఇప్పుడిక టీ20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఫార్మాట్లో వెస్టిండీస్ ఆటగాళ్లు సిద్ధహస్తులే. ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల్లో మెరుపులు మెరిపించే విండీస్ వీరులు.. కుర్రాళ్లతో నిండిన భారత జట్టుకు సవాల్ విసరడం ఖాయం. ఈ మధ్యే అమెరికాలో మేజర్ క్రికెట్ లీగ్ టోర్నీ తొలి సీజన్ ముగిసింది. ఆ టోర్నీ ఫైనల్లో నికోలస్ పూరన్ ఎలా చెలరేగిపోయాడో అందరూ చూశారు. కేవలం 55 బంతుల్లోనే 137 పరుగులతో అజేయంగా నిలిచిన పూరన్.. ఏకంగా 13 సిక్సర్లు బాదేశాడు. ఈ ఇన్నింగ్స్ ఛేదనలో కావడం మరో విశేషం. టీ20ల్లో విండీస్ వీరులు ఎంత ప్రమాదకారులో చెప్పడానికి ఇది ఉదాహరణ. పూరన్ ఒక్కడే కాదు.. కైల్ మేయర్స్, రోమన్ పావెల్, వంటి వారు కూడా ప్రమాదకారులే. టీ20ల్లో అత్యధిక మంది ఆల్‌రౌండర్లున్న జట్టు కూడా విండీసే. నిమిషాల్లో మ్యాచ్ ఫలితాలు మారిపోయేలా విధ్వంసం సృష్టించడం కరీబియన్ క్రికెటర్లకు అలవాటే. కాబట్టి గురువారం తొలి టీ20లో టీమ్‌ఇండియా జాగ్రత్తగా ఉండాల్సిందే.