India vs West Indies: ట్రినిడాడ్ ట్రిగ్గర్ మనదే.. విరాట్ ఆటతో విండీస్ చిత్తు
రెండో టెస్టు మ్యాచ్ తొలి రోజు కెప్టెన్ రోహిత్ శర్మ 143 బంతులు ఎదుర్కొని 80 పరుగులు చేస్తే, జైస్వాల్ 74 బంతుల్లో 57 పరుగులు చేశాడు. 500వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. ప్రస్తుతం 87 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు విరాట్.
India vs West Indies: ట్రినిడాడ్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు టీమిండియా 288 పరుగులు చేసి, నాలుగు వికెట్లు కోల్పోయింది. మరోసారి ఓపెనింగ్ బ్యాటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. రెండో టెస్టు మ్యాచ్ తొలి రోజు కెప్టెన్ రోహిత్ శర్మ 143 బంతులు ఎదుర్కొని 80 పరుగులు చేస్తే, జైస్వాల్ 74 బంతుల్లో 57 పరుగులు చేశాడు.
500వ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. ప్రస్తుతం 87 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు విరాట్. అభిమానులను ఉత్సాహపరుస్తూ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. సెంచరీకి 13 పరుగుల దూరంలో ఉన్నాడు. అతనికి రవీంద్ర జడేజా 36 పరుగులతో తోడుగా క్రీజులో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, జోమెల్ వారికన్, కెమర్ రోచ్, షానన్ గాబ్రియల్ తలో వికెట్ తీశారు. కోహ్లీ క్రీజ్‌లోకి వచ్చినప్పటి నుంచి స్టంప్స్‌కు అవతలి వైపు నాల్గో స్టంప్ దిశగా విండీస్ బౌలర్లు బంతులు వేశారు. కోహ్లీ తరచూ ఈ బంతులను టచ్ చేసి అవుట్ అవ్వడం తెలిసిందే. విండీస్ బౌలర్లు అదే స్ట్రాటజీని ఇక్కడ ఫాలో అయ్యారు. అయితే కోహ్లీ చాలా చాకచక్యంగా ఆడి 86 పరుగులు సాధించాడు. ఇరు జట్ల మధ్య జరుగుతున్న వందో టెస్టు కావడంతో భారత్, వెస్టిండీస్ కెప్టెన్‌లకు బ్రియాన్ లారా ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.
ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కోహ్లి ఐదో స్థానంలో నిలిచాడు. 500వ మ్యాచ్ ఆడుతున్న కోహ్లి అన్ని ఫార్మాట్లు కలిపి 25,548 పరుగులు సాధించాడు. ఇందులో 75 సెంచరీలు, 131 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో 34,357 పరుగులతో తొలి స్థానంలో నిలిచారు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. సచిన్ తర్వాత శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర 28,016 పరుగులతో రెండో స్థానంలో ఉండగా, ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ 27,483 పరుగులతో మూడో స్థానంలో, శ్రీలంక ఆటగాడు మహేల జయవర్దనే 25957 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నారు.