గ్రూప్ లో టాప్ లేపిన భారత్ ఆసీస్ తోనే సెమీస్ ఫైట్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా దుమ్మురేపుతోంది. వరుసగా రెండు విజయాలతోనే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత జట్టు తాజాగా చివరి లీగ్ మ్యాచ్ లోనూ అదరగొట్టింది.

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా దుమ్మురేపుతోంది. వరుసగా రెండు విజయాలతోనే సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్న భారత జట్టు తాజాగా చివరి లీగ్ మ్యాచ్ లోనూ అదరగొట్టింది. న్యూజిలాండ్ ను 44 పరుగుల తేడాతో నిలువరించింది. తద్వారా గ్రూప్ ఏలో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్ లలోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టిన రోహిత్ సేన సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది. తొలి రెండు మ్యాచ్ లతో పోలిస్తే కివీస్ తో పోరులో భారత్ గట్టిపోటీనే ఎదుర్కొంది. బ్యాటింగ్ లో తడబడి నిలబడింది. ఆరంభంలోనే గిల్, రోహిత్, కోహ్లీ ఔటవడంతో కష్టాల్లో పడినట్టు కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్ పటేల్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐదో స్థానంలో తనపై నమ్మకం ఉంచి పంపినందుకు అక్షర్ పటేల్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు.శ్రేయస్ అయ్యర్ 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 79, అక్షర్ పటేల్ 42 పరుగులు చేయగా.. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించాడు.
దుబాయ్ పిచ్ పై 250 పరుగుల టార్గెట్ ను కాపాడుకోవడం పెద్ద కష్టం కాకపోయినప్పటకీ కివీస్ జట్టులో ఆల్ రౌండర్లు ఎక్కువగా ఉండడంతో మ్యాచ్ ఆసక్తికరంగానే సాగింది. పైగా మ్యాచ్ సాగేకొద్దీ స్లో బౌలర్లకు అనుకూలించడంతో నలుగురు స్పిన్నర్ల వ్యూహం బాగా వర్కౌట్ అయింది. పేసర్లకు 8 ఓవర్లే ఇచ్చిన రోహిత్ శర్మ స్పిన్నర్లకు పూర్తి కోటా ఓవర్లు ఇచ్చాడు. అయితే కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కీలక ఇన్నింగ్స్ ఆడడం కాసేపు కలవరపెట్టింది. మిగిలిన బ్యాటర్లను ఔట్ చేయడంతో స్పిన్నర్లు సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా హర్షిత్ రాణా స్థానంలో జట్టులోకి వచ్చిన వరుణ్ చక్రవర్తి మరోసారి తానెంత విలువైన స్పిన్నరో చాటిచెప్పాడు. ఐదు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించాడు. తన స్పెల్ చివరి ఓవర్ చివరి బంతికి విలియమ్సన్ ను ఔట్ చేయడంతో భారత్ విజయం ఖాయమైంది.
ఇదిలా ఉంటే గ్రూప్ ఏలో మూడు విజయాలతో భారత్ టాప్ ప్లేస్ లో నిలిచింది. దీంతో గ్రూప్ బిలో సెకండ్ ప్లేస్ లో ఉన్న ఆస్ట్రేలియాతో సెమీఫైనల్లో తలపడబోతోంది. అటు మరో సెమీస్ లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా ఢీకొంటాయి. ఇక 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి రివేంజ్ తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆసీస్ ను చిత్తుగా ఓడించి వారిని సెమీస్ లోనే ఇంటికి పంపించాలని ఎదురుచూస్తున్నారు. దుబాయ్ వేదికగా మంగళవారం భారత్, ఆస్ట్రేలియా సెమీఫైనల్ జరగబోతోంది.