India Vs Pakistan: బంగ్లాదేశ్ పై గెలిచి దాయాదితో పోరుకు సిద్దమైన భారత్..
కొలంబో వేదికగా జరుగుతున్న ఆసియా ఎమర్జింగ్ కప్‌లో భారత కుర్రాళ్ల జోరు కొనసాగుతోంది. మూడు రోజుల క్రితమే పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన యువ భారత్.. నిన్న ప్రేమదాస స్టేడియం (కొలంబో) వేదికగా ముగిసిన రెండో సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది.

India will face Pakistan in the final after winning over Bangladesh in the Asia Emerging Cup
బ్యాటింగ్‌లో విఫలమైనా భారత స్పిన్నర్లు రాణించడంతో బంగ్లాకు షాక్ తప్పలేదు. ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. ఆదివారం పాకిస్తాన్‌తో జరుగబోయే ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన భారత్.. బంగ్లా బౌలర్ల ధాటికి తడబడింది. కెప్టెన్ యశ్ ధుల్ 85 బంతుల్లో 66 పరుగులతో రాణించాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శతకం సాధించిన ఓపెనర్ సాయి సుదర్శన్ (21) పరుగులు, అదే మ్యాచ్‌లో అర్థ సెంచరీ చేసిన నికిన్ జోస్ (17) కూడా విఫలమయ్యాడు.
ఆఖర్లో రాజవర్ధన్ హంగర్గేకర్ (21) పరుగుల పుణ్యమా అని భారత స్కోరు రెండు వందల మార్కు దాటింది. 49.1 ఓవర్లలో భారత్.. 211 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌కు శుభారంభమే దక్కింది. లక్ష్య ఛేదనలో ఆ జట్టు.. 20 ఓవర్ల వరకూ బాగానే ఆడింది. భారత్‌కు భంగపాటు తప్పదనుకున్నారంతా.. కానీ భారత స్పిన్నర్లు మాయ చేశారు. 18 ఓవర్లకు ముందు 100-2గా ఉన్న ఆ జట్టు.. మరో 15 ఓవర్లలో 60 పరుగులు జోడించి మిగిలిన 8 వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్ల ధాటికి బంగ్లా నిలువలేకపోయింది. బంగ్లా 160 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 51 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.