World Cup Squad: క్యాన్సర్ ఉన్నా కప్పులు కొట్టిన చరిత్ర మనది.. దగ్గులకు, తుమ్ములకు ఫామ్ కోల్పోవడం ఏంటి..?
టీమ్ ఇండియా మాత్రం ఇప్పటిదాకా కెరీర్లో ఏమంత గొప్ప ప్రదర్శన లేకపోయినా, ఇటీవలి ఫామ్ కూడా బాలేకున్నా కొందరు ఆటగాళ్లను ప్రపంచకప్‌నకు తీసుకెళ్తోంది. మరి సెలక్టర్లు పెట్టుకున్న నమ్మకాన్ని ఆ ఆటగాళ్లు నిలబెడతారా? లేక ప్రపంచకప్‌లో జట్టు అవకాశాలను దెబ్బ తీస్తారా?
World Cup Squad: వన్డే ప్రపంచకప్‌కు అన్ని దేశాలూ జట్లను ప్రకటించేశాయి. కప్పుపై కన్నేసిన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి మేటి జట్లు అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లనే ఎంచుకున్నాయి. కానీ, టీమ్ ఇండియా మాత్రం ఇప్పటిదాకా కెరీర్లో ఏమంత గొప్ప ప్రదర్శన లేకపోయినా, ఇటీవలి ఫామ్ కూడా బాలేకున్నా కొందరు ఆటగాళ్లను ప్రపంచకప్‌నకు తీసుకెళ్తోంది. మరి సెలక్టర్లు పెట్టుకున్న నమ్మకాన్ని ఆ ఆటగాళ్లు నిలబెడతారా? లేక ప్రపంచకప్‌లో జట్టు అవకాశాలను దెబ్బ తీస్తారా? అనేది అభిమానుల్లో అలజడిని సృష్టిస్తోంది.
ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఫామ్ కూడా ఒకప్పటిలా పతాక స్థాయిలో లేని మాట వాస్తవం. కానీ, వాళ్ల సామర్థ్యం ఏంటో అందరికీ తెలుసు. తమదైన రోజున వారిని అడ్డుకోవడం అసాధ్యం. వాళ్లు కొత్తగా రుజువు చేసుకోవాల్సిందేమీ లేదు. ఫాం అందుకుంటే వీరు జట్టుకు ఎంత ఉపయోగపడగలరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే, ఇప్పటిదాకా వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోకుండా, తామేంటో పూర్తి స్థాయిలో రుజువు చేసుకోకుండా ఉన్న ఆటగాళ్ల విషయంలోనే అభిమానుల్లో ఆందోళన నెలకొంది. జట్టుకు భరోసానివ్వలేకపోతున్న ఆ ఆటగాళ్లే.. అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్. అక్షర్ ఇటీవలి ఫామ్ పేలవంగా ఉన్నప్పటికీ అతడిని ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేశారు. అశ్విన్, చాహల్ లాంటి స్పిన్నర్లను కాదని అక్షర్‌ను ఎంపిక చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శార్దూల్ ఠాకూర్ ప్రతిభావంతుడైన బౌలరే కానీ.. అతడికి నిలకడ లేమి పెద్ద సమస్య.
వికెట్లు బాగానే తీస్తాడని పేరుంది కానీ ధారాళంగా పరుగులు ఇచ్చేయడం అతడి బలహీనత. ఇప్పటిదాకా 40 వన్డేలాడిన శార్దూల్ 29.11 సగటుతో 59 వికెట్లే తీశాడు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోలిస్తే ఈ ప్రదర్శన సాధారణం. లోయర్ ఆర్డర్లో కొన్నిసార్లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతుంటాడు శార్దూల్. అర్ష్‌దీప్, ఉమ్రాన్ మాలిక్ వన్డేల్లో రాణించకపోవడం.. ప్రసిద్ధ్ కృష్ణ గాయంతో ఇబ్బంది పడటం శార్దూల్‌కు కలిసొచ్చి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది. మరి తన ఎంపిక సరైందే అని తన ఆటతో శార్దూల్ రుజువు చేస్తాడేమో చూడాలి. ఇక సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో ఎంత ప్రమాదకర ఆటగాడో కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం. ఆ ఫార్మాట్లో ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గానూ మారాడు. ఈ ప్రదర్శన చూసి వన్డేలు, టెస్టుల్లోనూ అతడికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్లు పెరిగాయి. అయితే టెస్టుల సంగతి పక్కన పెడితే.. వన్డేల్లోనూ సూర్య సత్తా చాటలేకపోయాడు. వరుసగా అవకాశాలు ఇస్తున్నా ఉపయోగించుకోలేకపోయాడు.
ఇప్పటిదాకా 26 వన్డేలాడిన సూర్య.. 24.33 సగటుతో 511 పరుగులే చేశాడు. అందులో ఒక్క అర్ధశతకం కూడా లేదు. చివరగా వెస్టిండీస్ సిరీస్‌లో ఆడిస్తే అందులోనూ విఫలమయ్యాడు. ఆసియా కప్‌కు తుది జట్టులో ఆడించట్లేదు కానీ.. ప్రపంచకప్‌కు మాత్రం సూర్యను ఎంపిక చేశారు. అతడి స్థానంలో యువ ఆటగాడైన తిలక్ వర్మను ఎంపిక చేయాల్సిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరి ఈ ఆటగాళ్లు ఏ విధంగా తమపై ఉంచిన నమ్మకాన్ని సద్వినియోగం చేసుకుంటారో వేచి చూడాలి.