మళ్ళీ అదే ఆట, బ్యాట్లెత్తేసిన స్టార్ ప్లేయర్స్
ఆస్ట్రేలియా పర్యటనలో భారత బ్యాటర్ల తీరు మారలేదు... మళ్ళీ అదే తడబాటు...ఆసీస్ భారీస్కోరుకు ధీటుగా స్పందించినట్టే కనిపించినా అనూహ్యంగా వికెట్లు చేజార్చుకుని మ్యాచ్ లో వెనుకబడింది.
ఆస్ట్రేలియా పర్యటనలో భారత బ్యాటర్ల తీరు మారలేదు… మళ్ళీ అదే తడబాటు…ఆసీస్ భారీస్కోరుకు ధీటుగా స్పందించినట్టే కనిపించినా అనూహ్యంగా వికెట్లు చేజార్చుకుని మ్యాచ్ లో వెనుకబడింది. అంచనాలు పెట్టుకున్న కోహ్లీ, రోహిత్ , రాహుల్ నిరాశపరిచారు. ఫలితంగా ఈ మ్యాచ్ లోనూ ఫాలో ఆన్ ముప్పు వెంటాడే పరిస్థితి వచ్చింది. నిజానికి రెండోరోజు ఆసీస్ ను భారత్ త్వరగా ఆలౌట్ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆసీస్ టాపార్డర్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మన బౌలర్లకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కెప్టెన్ కమ్మిన్స్ తో కలిసి కంప్లీట్ గా భారత బౌలర్లపై ఆధిపత్యం కనబరిచాడు. మెల్ బోర్న్ గ్రౌండ్ లో తన రికార్డును కొనసాగిస్తూ సెంచరీతో అదరగొట్టాడు. ఓవరాల్ గా స్మిత్ టెస్ట్ కెరీర్ లో ఇది 34వ శతకం.. అలాగే భారత్ పై 11వ సెంచరీని సాధించాడు.
స్మిత్ కు తోడు కమ్మిన్స్ కూడా నిలకడగా ఆడడంతో ఆస్ట్రేలియా 474 పరుగుల భారీస్కోరుకు ఆలౌటైంది. మరోసారి భారత బౌలర్లలో బుమ్రా తప్పిస్తే మిగిలిన పేసర్లు నిరాశపరిచారు. బుమ్రా 4 వికెట్లు తీయగా..జడేజా 3 వికెట్లు పడగొట్టాడు. అయితే అంచనాలు పెట్టుకున్న సిరాజ్ మరోసారి అట్టర్ ఫ్లాపయ్యాడు. ఒక్క వికెట్ తీయకపోగా… భారీగా పరుగులు ఇచ్చేశాడు. ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీసినప్పటకీ ఆసీస్ అప్పటికే భారీస్కోర్ సాధించింది. తర్వాత భారత్ కాన్ఫిడెంట్ గానే తొలి ఇన్నింగ్స్ ఆరంభించినా కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమయ్యాడు. తన ఫ్లాప్ షోను కంటిన్యూ చేస్తూ 3 పరుగులకే ఔటయ్యాడు. తర్వాత ఫామ్ లో ఉన్న రాహులు కుదురుకున్నట్టే కనిపించినా కమ్మిన్స్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ దశలో జైశ్వాల్, కోహ్లీ జట్టును ఆదుకున్నారు. కీలక పార్టనర్ షిప్ తో జట్టు స్కోరును ముందుకు నడిపించారు. కోహ్లీ చాలా ఓపికగా ఆడాడు. ముఖ్యంగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ డెలివరీల జోలి పోకుండా తనను తాను నియంత్రించుకున్నాడు. కోహ్లీ నిదానంగా ఆడినా.. యశస్వి జైస్వాల్ మాత్రం బౌండరీల మోత మోగించాడు. ఈ క్రమంలో అతను 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అయితే యశస్వి జైస్వాల్ అత్యుత్సాహంతో లేని పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు. ఈ తప్పిదంతో శతకం చేజార్చుకోవడంతో పాటు టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. జైస్వాల్ తన వల్లే ఔటయ్యాడనే బాధనో లేక ఏకాగ్రత కోల్పోయాడో తెలియదు కానీ అప్పటి వరకు ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ జోలికి పోని కోహ్లీ.. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో అదే తరహా బంతిని ఆడబోయి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. నైట్ వాచ్ మన్‌గా వచ్చిన ఆకాశ్ దీప్ కూడా ఔటవ్వడంతో 159 పరుగులకే టీమిండియా సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన జడేజా, పంత్ మరో వికెట్ పడకుండా తొలి రోజు ఆటను ముగించారు. ఫాలో ఆన్ తప్పించుకోవాలంటే టీమిండియా ఇంకా 111 పరుగులు చేయాల్సి ఉంది. ఓవరాల్ గా ఆసీస్ స్కోరు కంటే భారత్ 310 పరుగులు వెనుకబడి ఉంది. మూడోరోజు తొలి సెషన్ లో మన బ్యాటర్లు ఎంతవరకూ నిలుస్తారనే దానిపై ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకోవడం ఆధారపడి ఉంటుంది.