Rohith Sharma: నువ్వు ఒక్కడివే ఆడట్లేదు నువ్వు జూలు విదిలిస్తే కథ వేరే ఉంటది..
ఈ ఏడాది భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ కష్టంగా ఉండబోతోందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. మునుపటి కంటే ఈసారి థ్రిల్లింగ్ మ్యాచ్‌లు ఎక్కువ ఉంటాయన్నాడు. అథ్లెటిక్స్‌లో ఒలింపిక్స్ ఎలాగో.. క్రికెట్లో వరల్డ్ కప్ అలాంటిది.
అందుకే క్రికెట్ ఆడే ప్రతి దేశం ఈ మెగా కప్‌ను గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతుంది. బెస్ట్ టీమ్స్ తలపడే ఈ టోర్నీలో నెగ్గడం అంత ఈజీ కాదు. జట్లు బలంగా ఉండటంతో పాటు పరిస్థితులు, అదృష్టం.. ఇలా ప్రతిదీ కలసిరావాలి. క్రికెట్ ఆడే ప్రతి ప్లేయర్ ఆశ వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో భాగమవ్వాలి, కప్‌ను చేతపట్టుకోవాలి. ఇప్పుడంటే టీ20ల రాకతో ఆ ఫార్మాట్లో రెండేళ్లకు ఓసారి ప్రపంచ కప్‌ను నిర్వహిస్తున్నారు. కానీ వన్డేల్లో నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే వరల్డ్ కప్ జరుగుతుంది. అందుకే ఈ ఫార్మాట్లో కప్ కోసం జరిగే మ్యాచ్‌లను చూసేందుకు ఆడియెన్స్ కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచ కప్‌కు ఈసారి భారత్ ఆతిథ్యం ఇస్తోంది. 2011 తర్వాత వరల్డ్ కప్‌ను ఇండియా హోస్ట్ చేయడం ఇదే ప్రథమం. ఆ ప్రపంచ కప్‌ను టీమిండియా ఒడిసిపట్టింది. ఈ నేపథ్యంలో ఇది మరోసారి రిపీట్ అవుతుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు. ఇవాళ వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెగా టోర్నీపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈసారి వరల్డ్ కప్ కష్టంగా ఉండబోతోందన్నాడు. ఈమధ్య కాలంలో క్రికెట్లో వేగంగా మార్పులు వచ్చాయని.. గేమ్‌లో స్పీడ్ పెరిగిందన్నాడు హిట్‌మ్యాన్. ప్రతి జట్టు ఇంతకుముందు కంటే ఇప్పుడు మరింత పాజిటివ్‌గా ఆడుతోందన్నాడు. ఈ ట్రోఫీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీలో తమ బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని రోహిత్ పేర్కొన్నాడు.