Ind Vs Nep: తమ్ముళ్లూ.. ఇరగదీశారు.. గొప్ప స్థాయికి ఎదిగే జట్టు మీది..!
మ్యాచ్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు నేపాల్ ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ జట్టు ఆటగాళ్లతో కాపేపు ముచ్చటించారు. టీమ్ ఇండియా ఆటగాళ్లతో నేపాల్ ప్లేయర్స్ ఫొటోలు దిగారు.

Ind Vs Nep: ఇండియాతో జరిగిన మ్యాచ్ నేపాల్‌కు తొలి అంతర్జాతీయ మ్యాచే అయినా గట్టి పోటీనిచ్చింది. బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోయినా బ్యాటర్లు మాత్రం సత్తాచాటారు. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 230 పరుగులు చేశారు. అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించి భారత్ లక్ష్యాన్ని 145గా నిర్దేశించారు.
ఈ లక్ష్యాన్ని టీమ్‌ఇండియా 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. అయితే, మ్యాచ్ ముగిసిన అనంతరం భారత ఆటగాళ్లు నేపాల్ ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆ జట్టు ఆటగాళ్లతో కాపేపు ముచ్చటించారు. టీమ్ ఇండియా ఆటగాళ్లతో నేపాల్ ప్లేయర్స్ ఫొటోలు దిగారు. అనంతరం విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్య, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మ్యాచ్‌లో రాణించిన నేపాల్ ఆటగాళ్లకు మెడల్స్ అందించారు.
జట్టు స్కోరు 200 దాటడంలో కీలకపాత్ర పోషించిన సోంపాల్ కామిని హార్దిక్ పాండ్య అభినందించి మెడల్ అందించాడు. లోయర్ ఆర్డర్ బ్యాటర్ అయిన సోంపాల్ 56 బంతుల్లో 48 పరుగులు చేశాడు. అర్ధ శతకం బాదిన ఆసిఫ్ షేక్‌ను కోహ్లీ అభినందించి కొన్ని విలువైన సలహాలు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నేపాల్ క్రికెట్ అసోసియేషన్ సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.