1983 WC: ఇండియన్ క్రికెట్ చరిత్రలో గోల్డెన్ పేజీ.. 1983 ప్రపంచ కప్ విజయానికి 40ఏళ్లు పూర్తి..!
ఇప్పడంటే క్రికెట్ దేశంలో మతంలా మారి ఉండొచ్చు. క్రికెట్ లేని ఇండియాను ఊహించుకోవడం కష్టంగానూ ఉండొచ్చు. అయితే దేశంలో క్రికెట్ ఈ స్థాయికి ఎదిగడానికి కారణమైన విజయం ఒకటి ఉంది. అదే 1983 ప్రపంచ కప్.
1983 WC: అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగి కప్ కొట్టడం అంటే మాములు విషయం కాదు. అది కూడా అప్పటికే రెండుసార్లు వరల్డ్ కప్ గెలిచిన వెస్టిండీస్ వీరులను ఓడించి, కప్పు సాధించింది టీమిండియా!
ఇప్పడంటే క్రికెట్ దేశంలో మతంలా మారి ఉండొచ్చు. క్రికెట్ లేని ఇండియాను ఊహించుకోవడం కష్టంగానూ ఉండొచ్చు. అయితే దేశంలో క్రికెట్ ఈ స్థాయికి ఎదిగడానికి కారణమైన విజయం ఒకటి ఉంది. అదే 1983 ప్రపంచ కప్. టోర్నీ ఆడటానికి ముందు టీమిండియా ఎన్నో అవమానాలు భరించింది. అసలు టీమిండియా వరల్డ్ కప్ ఆడటం అవసరమా అని గేలి చేసిన దేశాలు కూడా ఉన్నాయి. అండర్‌డాగ్స్‌గా 1983 వరల్డ్ కప్‌లోకి ఎంట్రీ ఇచ్చిన టీమిండియా విమర్శకుల నోళ్లను ఆటతోనే మూయించింది. క్రికెట్ అంటే వెస్టిండీస్.. వెస్టిండీస్ అంటే క్రికెట్ అని భావించిన ఆ రోజుల్లో ఫైనల్‌లో కరేబియన్ వీరులను మట్టికరిపించింది కపిల్ దేవ్ టీమ్.
భారత క్రికెట్‌ను గొప్ప మలుపు తిప్పిన వరల్డ్ కప్ టోర్నీ 1983. ఇంగ్లాండ్‌లో జరిగిన మూడో ప్రపంచ కప్‌లో అండర్ డాగ్‌గా బరిలోకి దిగిన భారత్ ఎవరూ ఊహించని విధంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అందరూ ముందుగానే జోస్యం చెప్పినట్టుగానే, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్ కూడా ఫైనల్ చేరింది. లో స్కోరు ఫైనల్‌లో, కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా తక్కువ పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయభేరి మోగించి, విశ్వవిజేతగా నిలిచింది.
ఫైనల్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 60 ఓవర్ల కోటాను కూడా పూర్తిగా ఆడలేకపోయింది. 54.4 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. హేమాహేమీలు ఉన్న విండీస్‌కు భారత్ నిర్దేశించిన లక్ష్యం ఏమాత్రం పెద్దది కాదని, ఆ జట్టు ఆడుతూపాడుతూ గెలిచేస్తుందని క్రీడా పండితులు సైతం జోస్యం చెప్పారు. కానీ, భారత బౌలర్ల ముందు విండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. 52 ఓవర్లలో 140 పరుగులకే విండీస్ ఆలౌటైంది. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేసి, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగితే ఫలితం ఏ విధంగా ఉంటుందనేది ఆ మ్యాచ్ యావత్ క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పింది.
1983వరల్డ్ కప్ విజయంతోనే ఇండియాలో క్రికెట్‌పై క్రేజ్ పెరిగింది. ఇప్పుడు టీమిండియా గ్రేట్స్‌లో మనం చెప్పుకుంటున్న సచిన్, ద్రవిడ్ లాంటి ఆటగాళ్లు 1983 వరల్డ్ కప్ స్ఫూర్తితోనే క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. అటు టీమిండియా ఇచ్చిన షాక్‌తోనే వెస్టిండీస్ పతనం మొదలైంది. అంతకముందు 1975, 1979 ప్రపంచ కప్‌ల్లో వెస్టిండీస్‌దే ట్రోఫీ. ప్రపంచ కప్ టోర్నీ మొదలైంది 1975లోనే. అంటే తొలి రెండు వరల్డ్ కప్‌లను ముద్దాడిన విండీస్ ముచ్చటగా మూడో సారి ట్రోఫీ గెలవాలని ఆశపడింది. కానీ టీమిండియా పట్టుదల ముందు తలొగ్గింది. మొహిందర్ అమర్‌నాథ్ అసాధారణ ప్రతిభతో భారత్ క్రికెట్ స్థితిని మలుపుతిప్పాడు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..!