మరో యువీ దొరికాడు… తిప్పండిరా మీసం

క్రికెట్ లో ఓ ఆటగాడు రిటైరయితే మరో ఆటగాడు వస్తాడు... కానీ అతన్ని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడా అనేది ఖచ్చితంగా చెప్పలేం... ఇదే సమయంలో కొందరిలా ఆడే క్రికెటర్లు మాత్రం చాలా కొద్దిమందే ఉంటారు...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2025 | 05:55 PMLast Updated on: Feb 05, 2025 | 5:55 PM

Intersting Facts About Abhishek Sharma

క్రికెట్ లో ఓ ఆటగాడు రిటైరయితే మరో ఆటగాడు వస్తాడు… కానీ అతన్ని ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడా అనేది ఖచ్చితంగా చెప్పలేం… ఇదే సమయంలో కొందరిలా ఆడే క్రికెటర్లు మాత్రం చాలా కొద్దిమందే ఉంటారు… భారత క్రికెట్ లో సిక్సర్ల కింగ్ అనగానే గుర్తొచ్చే పేరు యువరాజ్ సింగ్.. ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన యువీ ఫీట్ ను క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు… అలాంటి యువీ తరహాలోనే మంచినీళ్ళు తాగినంత ఈజీగా సిక్సర్లు బాదేస్తున్నాడు భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ… సరిగ్గా యువీ తరహాలోనే బ్యాటింగ్ చేస్తూ సిక్సర్ల కింగ్ ను గుర్తుకు తెస్తున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ తో యువరాజ్ వారసుడిగా పేరు తెచ్చుకుంటున్నాడు. తాజాగా ఇంగ్లాండ్ తో చివరి టీ ట్వంటీ అభిషేక్ సిక్సర్ల సునామీనే సృష్టించాడు. అతని బ్యాటింగ్ స్టైల్.. లెజెండరీ బ్యాటర్ యువరాజ్ సింగ్‌ను గుర్తుకు తెచ్చింది. అతని తరహాలోనే లెఫ్ట్ హ్యాండర్ అభిషేక్ శర్మ. అతని స్టాన్స్, షాట్ సెలెక్షన్, ఫుట్ వర్క్ మొత్తం యూవీని మరిపించేలా సాగింది. ఇదివరకు అభిషేక్ శర్మకు మెంటార్‌గా వ్యవహరించాడు యువరాజ్. దాన్ని అందిపుచ్చుకున్నాడు అభిషేక్.

వాంఖేడే స్టేడియంలో అభిషేక్ బ్యాటింగ్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువే… అతను కొట్టిన ప్రతీ సిక్సర్ హైలెట్ గానే నిలిచింది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ గా పేరున్న జోఫ్రా ఆర్చర్ ను సైతం ఈ జూనియర్ యువీ ఉతికారేశాడు. ఏదో షాట్లు కొట్టడం కాదు… భారీ సిక్సర్లతో ఆర్చర్ కు చుక్కలు చూపించాడు. నేను ఫోర్లు కొట్టను సిక్సర్లే బాదుతా అన్న తరహాలో అభిషేక్ విధ్వంసం సాగింది. నిజానికి అతన్ని ఐపీఎల్ కెరీర్ చూసిన వారెవరికైనా యువరాజ్ తోనే పోలుస్తున్నారు. ఎందుకంటే సిక్సర్లను అలవోకగా బాదేస్తున్నాడు. పార్ట్ టైమ్ బౌలర్ గానూ వికెట్లు తీస్తున్నాడు. మెరుపు ఫీల్డింగ్ తోనూ ఆకట్టుకుంటున్నాడు. అందుకే భారత్ జట్టుకు మరో యువీ దొరికేశాడంటూ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. గురువులాగే ఇంగ్లాండ్‌పై ఫాస్టెస్ట్ 50 చేసిన బ్యాటర్‌గా పేరు లిఖించుకున్నాడు. గతంలో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు యువరాజ్ సింగ్. ఇప్పుడు ఆ వారసత్వాన్ని శిష్యుడు కొనసాగించాడు. అదే ఇంగ్లాండ్‌పై 17 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడు.

ఐపీఎల్ 2022 సీజన్ సమయంలో అభిషేక్ శర్మను సన్ రైజర్స్ కొనసాగించడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కానీ అతని టాలెంట్ ఏంటనేది సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ ముందే గుర్తించింది. టీ ట్వంటీ మ్యాచ్ లో మెరుపు ఆరంభాలే కీలకం… అవే భారీస్కోరును పునాది వేస్తాయి. అభిషేక్ ఐపీఎల్ కెరీర్ లో వరల్డ్ క్రికెట్ స్టార్ బౌలర్స్ ను ఆటాడుకున్నాడు. జట్టుతో సంబంధం లేకుండా పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. బౌలర్ ఎంత వేగంతో బంతులు వేసినా అంతే వేగంతో దానిని బౌండరీ అవతలకు పంపిస్తున్నాడు. మధ్యలో కొన్ని బలహీనతల కారణంగా పలు అవకాశాలను వృథా చేసుకున్నప్పటకీ వాంఖేడే సెంచరీతో మళ్ళీ గాడిన పడినట్టే కనిపిస్తున్నాడు.
కాగా గత ఏడాది జింబాబ్వేపై టీ ట్వంటీ అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లోనే శతక్కొట్టాడు. ఇప్పటి వరకూ 17 మ్యాచ్ లలో 535 పరుగులు చేయగా.. దీనిలో రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చ్చే టీ ట్వంటీ ప్రపంచకప్ కు కోర్ టీమ్ ను రెడీ చేస్తున్న కోచ్ గౌతమ్ గంభీర్ ఈ యువ ఓపెనర్ ను సరిగ్గా సిద్ధం చేస్తే భారత్ కు మరో యువీ దొరికినట్టేనని చెప్పొచ్చు.