వేలంలో అమ్ముడుపోలేదు.. కట్ చేస్తే స్టార్ టీంకు కెప్టెన్
ఐపీఎల్ 2025 సీజన్ కు సన్నాహాలు మొదలైపోయాయి. మెగావేలంలో కీలక ఆటగాళ్ళను సొంతం చేసుకున్న అన్ని ఫ్రాంచైజీలు తమ జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టాయి. కొన్ని జట్లు కెప్టెన్లను కూడా ప్రకటించాయి.

ఐపీఎల్ 2025 సీజన్ కు సన్నాహాలు మొదలైపోయాయి. మెగావేలంలో కీలక ఆటగాళ్ళను సొంతం చేసుకున్న అన్ని ఫ్రాంచైజీలు తమ జట్టు కూర్పుపై ఫోకస్ పెట్టాయి. కొన్ని జట్లు కెప్టెన్లను కూడా ప్రకటించాయి. మరికొన్ని జట్లు ప్రిపరేషన్ క్యాంపులను కూడా స్టార్ట్ చేశాయి. ఈ మెగా లీగ్ కోసం అభిమానుల్లో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతున్న వేళ భారీ అంచనాలున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఈ సారి కొత్త సారథితో బరిలోకి దిగుతోంది. తమ టైటిల్ కల నెరవేర్చుకునేందుకు యువ ఆటగాడు రజత్ పాటిదార్ కు పగ్గాలు అప్పగించింది. కోహ్లీతో పాటు పలువురు స్వదేశీ, విదేశీ స్టార్ ప్లేయర్స్ జట్టులో ఉండగా అతనికే ఎందుకు కెప్టెన్సీ ఇచ్చారనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. ఈ క్రమంలో రజత్ పాటిదార్ గురించి క్రికెట్ ఫ్యాన్స్ గూగుల్ లో తెగవెతికేస్తున్నారు.
మూడేళ్ల క్రితం వేలంలో అమ్ముడుపోని రజత్ పటీదార్.. ఇప్పుడు వరల్డ్ బెస్ట్ క్రికెట్ ఫ్రాంచైజీ అయిన ఆర్‌సీబీకి సారథిగా ఎంపికవడం క్రికెట్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. గత మూడేళ్లలో అతని ఆటలో వచ్చిన మార్పే ఈ సక్సెస్ కు కారణం. ఐపీఎల్ 2021 సీజన్‌లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రజత్ పటీదార్.. మూడేళ్ల వ్యవధిలోనే కెప్టెన్‌గా ఎదిగాడు. దీనిలో గాయంతో ఒక సీజన్ ఆడనేలేదు. తొలి సీజన్ లో సాధారణ బ్యాటర్ లానే కనిపించాడు. అరంగేట్ర సీజన్ లో రజత్ 4 మ్యాచ్‌లు ఆడి 71 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ పేలవ ప్రదర్శనతో ఆర్‌సీబీ తర్వాతి సీజన్‌కే అతన్ని వేలంలోకి వదిలేసింది. ఐపీఎల్ 2022 వేలంలో అతన్ని ఏ జట్టు కూడా కొనుగోలు చేయకపోవడంతో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అయితే ఆర్‌సీబీ తీసుకున్న అనామక ప్లేయర్ లవ్‌నీత్ సిసోడియా గాయపడటంతో అతని స్థానంలో అనూహ్యంగా రజత్ పటీదార్ జట్టులోకి వచ్చాడు.
తనకంటూ స్పెషాలిటీ ఉంటేనే గుర్తింపు దక్కుతుందని భావించి హిట్టింగ్ చేయడం మొదలుపెట్టాడు. భారీ షాట్లతో మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చేలా రాటుదేలాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో అతనికి ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ తుది జట్టులో చోటిచ్చింది. 20 లక్షల కనీస ధరతోనే జట్టులోకి వచ్చిన అతను ఆ సీజన్‌లో 8 మ్యాచ్‌ల్లో 55.50 సగటుతో 333 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలతో పాటు ఓ సెంచరీ ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో 54 బంతుల్లో 112 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. తద్వారా ప్లేఆఫ్స్‌లో సెంచరీ చేసిన తొలి అనామక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్ పటీదార్ కెరీర్ రే మార్చేసింది.
అదే సమయంలో గాయం కారణంగా తర్వాతి ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కానీ అతనిపై నమ్మకం ఉంచిన ఆర్‌సీబీ అండగా నిలిచింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో రీఎంట్రీ ఇచ్చిన అతను 15 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీలతో 395 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో ఆర్‌సీబీ అతన్ని 11 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. గత సీజన్ వరకు జట్టును నడిపించిన ఫాఫ్ డుప్లెసిస్‌ను వదిలేయడంతో తమ సారథిగా రజత్ పటీదార్‌ను నియమించింది. గాయపడిన ఆటగాడి స్థానంలో ఎంట్రీ ఇచ్చిన రజత్ వచ్చిన అవకాశాన్ని అద్భుతంగా వినియోగించుకున్నాడు. గాయాలు ఇబ్బందిపెట్టినా క్రమంగా రాటుదేలి కీలక ప్లేయర్ గా నిలిచాడు. ఇప్పుడు ఏకంగా ఆర్సీబీ సారథ్యబాధ్యతలు అందుకున్నాడు. దీంతో రజత్ పాటిదార్ టాలెంట్ కు లక్ కూడా తోడైయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.