ఇక్కడ 9… అక్కడ 2 తెలుగు రాష్ట్రాల ఫ్యాన్స్ కు పండగే
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలకు బీసీసీఐ రెగ్యులర్ గానే అంతర్జాతీయ మ్యాచ్ లు కేటాయిస్తూ వస్తోంది. గతంతో పోలిస్తే ఐపీఎల్ వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ క్రికెట్ క్రేజ్ బాగా పెరిగిందనే చెప్పాలి.

గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలకు బీసీసీఐ రెగ్యులర్ గానే అంతర్జాతీయ మ్యాచ్ లు కేటాయిస్తూ వస్తోంది. గతంతో పోలిస్తే ఐపీఎల్ వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ క్రికెట్ క్రేజ్ బాగా పెరిగిందనే చెప్పాలి. పలువురు యువ ఆటగాళ్ళు సైతం జాతీయ జట్టుకు ఎంపికవుతున్నారు. ఈ క్రమంలోనే నితీశ్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ వంటి యంగ్ స్టర్స్ వెలుగులోకి వచ్చారు. అటు అంతర్జాతీయ మ్యాచ్ లను రొటేషన్ విధానంలో కేటాయిస్తున్న బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్ లకూ ఇక్కడ ప్రాధాన్యతనిస్తోంది. ఏపీకి ఐపీఎల్ టీం లేకపోయినా ఢిల్లీ క్యాపిటల్స్ తమ హోంగ్రౌండ్ గా విశాఖను ఎంచుకోవడంతో అక్కడ కూడా మ్యాచ్ లు జరుగుతున్నాయి. తాజాగా 2025 సీజన్ కు సంబంధించి కూడా విశాఖలో రెండు మ్యాచ్ లు జరగనుండగా… హైదరాబాద్ లో లీగ్ స్టేజ్ కాకుండా ప్లేఆఫ్స్ తో కలిసి 9 మ్యాచ్ లు ఫ్యాన్స్ ను అలరించబోతున్నాయి.
విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియాన్ని మరోసారి సెకండ్ హోం గ్రౌండ్ గా ఢిల్లీ క్యాపిటల్స్ ఎంచుకుంది. ఐపీఎల్ 2025 లో ఇక్కడ ఆ జట్టు రెండు మ్యాచ్ లు ఆడనుంది. మార్చి 25న లక్నో సూపర్ జెయింట్స్ తో, మార్చి 30న మధ్యాహ్నం మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడుతుంది. గత సీజన్ లోనూ వైజాగ్ లో ఢిల్లీ రెండు మ్యాచ్ లాడింది. తాజా షెడ్యూల్ తో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ వచ్చింది. ఉప్పల్ స్టేడియంలో లీగ్ దశలో సన్ రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్ లు ఆడుతుంది. మార్చి 23న రాజస్థాన్ తో మ్యాచ్ మాత్రమే మధ్యాహ్నం ఆరంభమవుతుంది. మిగతావన్నీ రాత్రి జరుగుతాయి. మార్చి 27న లక్నోతో, ఏప్రిల్ 6న గుజరాత్ తో, ఏప్రిల్ 12న పంజాబ్ తో, ఏప్రిల్ 23న ముంబయితో, మే5న దిల్లీతో, మే 10న కోల్ కతాతో సన్ రైజర్స్ తలపడుతుంది. అనంతరం రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్ లు మే 20న క్వాలిఫయర్-1, మే 21న ఎలిమినేటర్ ఇక్కడ జరుగుతాయి.
అయితే ఐపీఎల్ లో అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ లు లేకపోవడం ఫ్యాన్స్ కు కాస్త నిరాశే. 7 మ్యాచ్ లు హైదరాబాద్ లోనే సన్ రైజర్స్ ఆడబోతున్నా… ఈ రెండు జట్లతో మ్యాచ్ లు లేవు. దీంతో స్టార్ ప్లేయర్లు కోహ్లి, ధోనీని చూసే అవకాశం లేకుండా పోయింది. అయితే ఆ జట్లు క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ లో ఆడితే మాత్రం అప్పుడు కోహ్లి, ధోనీలను హైదరాబాద్ లో చూడొచ్చు. ఈ రెండు ప్లేఆఫ్స్ మ్యాచ్ లకు ఉప్పల్ స్టేడియాన్ని వేదిక గా నిర్ణయించారు.