Siraj: సిరాజ్‌.. వాటి జోలికి పోవద్దు! మంచి కెరీర్‌ను నాశనం చేసుకోకు

టీమిండియాలో ఇప్పుడు నంబర్‌ బౌలర్‌ సిరాజ్.. ఒకప్పుడు రన్‌ మెషీన్‌ అంటూ ఎగతాళి చేసిన వాళ్లే అతడిని ఇప్పుడు ఆకాశానికి ఎత్తేస్తున్నారు.! అయితే ఇటివలి కాలంలో సిరాజ్‌ బిహేవియర్‌పై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 7, 2023 | 07:50 PMLast Updated on: May 07, 2023 | 7:50 PM

Ipl 2023 Fans Troll Mohammed Siraj For Showing Finger To Phil Salt And Suggest Not To Be Like Sreesanth

పాతాళం నుంచి ఆకాశమంతా ఎత్తుకు ఎదిగిన ఆటగాళ్లు ఇటివలి కాలంలో ఎవరైనా ఉన్నారంటే కచ్చితంగా సిరాజ్‌ పేరే మొదటిగా వినిపిస్తుంది! వ్యక్తిగతంగా.. కెరీర్‌ పరంగా.. అటు గ్రౌండ్‌లో.. ఇటు సోషల్‌మీడియాలో ఎక్కడా కూడా అతనికి కలిసిరాని కాలం నుంచి ఎవరికి అందనంతా ఎత్తుకు ఎదిగాడు సిరాజ్‌. ఇదంతా ఒక్క ఏడాదిలోనే జరిగింది. కెరీర్‌లో వచ్చిన సవాళ్లకు ఎదురీది పోరాడాడతను. బుమ్రా లేని లోటును ఏ మాత్రం కనపడనివ్వకుండా జట్టు బౌలింగ్‌ భారాన్ని మోస్తూ టీమిండియాకు విజయాలను అందిస్తున్నాడు. ఇటు ఐపీఎల్‌లోనూ బెంగళూరు జట్టు బౌలింగ్‌ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు.

ఒకప్పుడు సిరాజ్‌ జట్టులో ఉన్నాడంటే రన్‌ మెషీన్ ఉన్నాడురా.. ఎంత కొట్టినా సరిపోదంటూ బెంగళూరు ఫ్యాన్స్‌ ఎగతాళి చేసేవాళ్లు. చిన్నస్వామీ పిచ్‌పై హేమాహేమీ బౌలర్లకే బాల్ ఎక్కడ వేయాలో అర్థంకానీ దుస్థితి ఇప్పటికీ ఉంది. బెంగళూరు అభిమానులకు ఈ విషయం అర్థంకాదు.. ఎందుకంటే ఏదో తమ జట్టు బ్యాటర్లు 200 రన్స్ కొడుతుంటే బౌలర్లు సరిగ్గా వేయడంలేదని.. ఛేజింగ్‌లో బౌలర్ల వల్లే ఓడిపోతున్నామనే భ్రమలో బతుకుతుంటారు. నిజానికి ఆ పిచ్‌, గ్రౌండ్‌ లెంగ్త్‌.. బౌండరీ డిస్టెన్స్‌ అలా ఉంటాయి. బ్యాట్‌కు బాల్ ఎడ్జ్‌ అయినా బౌండరీ లైన్‌ అవతల పడుతుంది.! అలాంటి గ్రౌండ్‌లోనూ ఈ సీజన్‌లో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు.మేటి బ్యాటర్లను కట్టడి చేస్తూ అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 15 వికెట్లు తీశాడు. ఎకానమీ కూడా 7.7గా ఉంది. అయితే సిరాజ్ ఓ విషయంలో మాత్రం పలు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అదే తన కోపం..!
ఈ సీజన్‌లో మూడు సార్లు సహనం కోల్పోయాడు.. అది కూడా నార్మల్‌గా కాదు.. రెండుసార్లు కావాలనే ప్రత్యర్థి ఆటగాళ్లను అనవసరంగా స్లెడ్జ్‌ చేయగా.. మరోసారి తన సొంత జట్టు ఆటగాడిపైనే తీవ్రంగా నోరుపారేసుకున్నాడు.

Mohammad Siraj

Mohammad Siraj

సాల్ట్‌తో గొడవ:
ఢిల్లీ బ్యాట‌ర్, ఇంగ్లండ్ స్టార్ ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్‌తో సిరాజ్‌ గొడవ పడడం అభిమానులకు ఏ మాత్రం నచ్చలేదు.అరుణ్ జైట్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఇద్ద‌రి మ‌ధ్య మాట‌ల యుద్దం జరిగింది. సిరాజ్ నోరు పారేసు కోవ‌డంతో సాల్ట్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చాడు. అదే సమయంలో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ సైతం సిరాజ్‌తో తేల్చుకునేందుకు వచ్చాడు. చివ‌ర‌కు మాటా మాటా పెరిగి ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసే ప‌రిస్థితి నెల‌కొనే స‌మ‌యంలో అంపైర్ జోక్యం చేసుకోవ‌డంతో గొడ‌వ స‌ద్దు మ‌ణిగింది. మొత్తంగా సిరాజ్ , సాల్ట్‌కు సంబంధించిన వ్య‌వ‌హారం హాట్ టాపిక్‌గా మారింది.

నవీన్‌ ఉల్‌ హక్‌తో గొడవ:
ఈ సీజన్‌లో అన్నిటికంటే అభిమానులకు గుర్తుండిపోయే మ్యాచ్‌గా ఆర్సీబీ వర్సెస్‌ లక్నో మ్యాచ్‌ నిలుస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్‌లోనే గంభీర్‌, విరాట్ కోహ్లీ గొడవ పడ్డారు.. మ్యాచ్‌ ముగిసిన తర్వాత వారిద్దరి మధ్య వాగ్వాదం జరగగా.. గ్రౌండ్‌లో కోహ్లీ..నవీన్‌ ఉల్‌ హక్‌ గొడవపడ్డారు.! అయితే ఈ అగ్గి రగలడానికి సిరాజ్‌ కూడా ఓ కారణంగా తెలుస్తోంది. నవీన్‌ ఉల్‌ హక్‌ను సిరాజ్‌ఏదో అనడంతో ఈ రచ్చ మొదలైందన్న ప్రచారం జరుగుతోంది.

సొంత జట్టు ప్లేయర్‌పైనే చిందులు:
గత నెల 23న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిరాజ్‌ తన సొంత జట్టు ప్లేయర్‌పైనే నోరుపారేసుకున్నాడు. సంజూశాంసన్‌ టీమ్‌తో ఉత్కంఠంగా సాగిన ఆ మ్యాచ్‌లో సిరాజ్ సహనం కోల్పోయాడు. 19వ ఓవర్ చివరి బంతికి రాజస్థాన్‌ బ్యాటర్ సెకండ్ రన్ కోసం పరిగెత్తాడు. ఫీల్డర్ లొమ్రార్ బంతిని విసరగా అప్పటికే సిరాజ్ కాలితో బెయిల్స్ పడగొట్టాడు. స్టంప్ మొత్తం తొలగిస్తే అవుట్ అయ్యేవాడు. కానీ అలా జరగలేదు. దీంతో సిరాజ్ ఆగ్రహంతో ఊగిపోతూ లొమ్రార్‌ను బూతులు తిట్టాడు. ఇది బెంగళూరు ఆటగాళ్లను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. సిరాజ్‌ ఇలానే ఉంటే కష్టమని.. మరో శ్రీశాంత్‌లా తయారవద్దని.. బుమ్రాని చూసి నేర్చుకోవాలని ఫ్యాన్స్‌ కోరుతున్నారు.