IPL: ‘నో బాల్‌ వెనుక ఎన్నో అనుమానాలు’! ఐపీఎల్‌ అంటేనే బిగ్‌బాస్‌ షో లెక్క అంటూ సెటైర్లు!

ఐపీఎల్‌లో జరిగే వింత పరిణామాలు అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా జరుగుతుంటాయి. అయితే ఐపీఎల్‌పై మాత్రం మొదటి నుంచి అనేక వివాదాలున్నాయి. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ వర్సెస్‌ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌ తర్వాత సోషల్‌మీడియాలో 'నో బాల్‌' ఇష్యూపై అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 9, 2023 | 09:30 AMLast Updated on: May 09, 2023 | 9:30 AM

Ipl 2023 Ipl Script Writers Twitter Reacts After Sandeep Sharma No Ball Drama Fans Compare It With Rp Singh No Ball Against Chennai Super Kings

ఐపీఎల్‌ అందించే కిక్కు ప్రపంచంలో మరే ఇతర క్రికెట్ లీగ్‌ ఇవ్వదు. అందుకే ఇది చాలా మంది క్రికెట్ ప్రేమికులకు ఫేవరెట్ లీగ్. చివరి ఓవర్‌లో 28 పరుగులు చేయాలన్నా.. రెండు ఓవర్లకు 50 పరుగులు చేయాలన్నా.. చివరి ఓవర్‌లో 5పరుగులే డిఫెంఢ్‌ చేయాలన్నా అవన్నీ ఐపీఎల్‌లోనే సాధ్యం. ఇదంతా ఫిక్సింగ్‌ అంటూ చాలా మంది మ్యాచ్‌ ముగిసిన తర్వాత వాదిస్తుంటారు. ముఖ్యంగా వాళ్లు సపోర్టు చేసిన టీమ్ ఓడిపోతే ఈ వాదనను గట్టిగా వినిపిస్తారు. అయితే రెండు నెలలు పాటు జరిగే ఈ పొట్టి సంగ్రామంలో ఇలాంటి అద్భుతాలు సాధ్యమేనన్నది మరికొందరి వాదన. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్ రాజస్థాన్‌ రాయల్స్ మ్యాచ్‌లో చివరి బంతి నో బాల్ కావడం.. ఆ తర్వాత హైదరాబాద్‌ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించడంపై మరోసారి సోషల్‌మీడియాలో ఐపీఎల్‌ స్క్రిప్ట్‌ అంశం తెరపైకి వచ్చింది.

రాజస్థాన్‌ కొంపముంచిన నో బాల్:
చివరి ఓవర్‌లో 17పరుగుల చేయాల్సిన సన్‌రైజర్స్‌ ఆఖరి బంతికి 5పరుగులు చేస్తే గెలిచే స్థితిలోకి వచ్చింది.. ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. సందీప్‌ శర్మ వేసిన ఆఖరి బంతిని సమద్‌ లాంగాఫ్‌ మీదగా సిక్స్‌కు ప్రయత్నించాడు..అయితే బాల్‌ బ్యాట్‌కి సరిగ్గా కనెక్ట్‌ అవ్వలేదు. దీంతో అది వెళ్లి అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న బట్లర్ చేతిలో పడింది.. ఇంకేముంది రాజస్థాన్‌ అభిమానులు ఎగిరి గంతేశారు. అటు సన్‌రైజర్స్‌ ప్లేయర్లు తలలు పట్టుకున్నారు.. కానీ ఇంతలోనే అంపైర్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఆ బంతిని నో బాల్‌గా ప్రకటించాడు. సందీప్‌ శర్మ ఓవర్‌ స్టెప్‌ వేసినట్లు రిప్లైలో తేలింది. దీంతో చివరి బంతికి నాలుగు పరుగులు అవసరమవగా..సమద్ సిక్సర్‌తో మ్యాచ్‌ను గెలిపించాడు.

ఇలా చివరి బంతికి విజయాలు సాధించడం ఐపీఎల్‌లోనైనా.. అంతర్జాతీయ క్రికెట్‌లోనైనా.. ఇతర క్రికెట్‌ లీగ్‌లోనైనా సర్వసాధారణమే.. అయితే ఈ మ్యాచ్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో కుల్దీప్‌ వేసిన ఫుల్‌టాసులపై ఫ్యాన్స్‌కు అనుమానాలు ఉన్నాయి. ఫుల్ టాస్‌తో పాటు..లూజ్‌ బాల్స్‌ వేసిన కుల్దీప్‌ ఆ ఓవర్‌లో ఏకంగా 24పరుగులు సమర్పించుకున్నాడు. ఇక చివరి ఓవర్‌లో అందివచ్చిన క్యాచ్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ నెలపాలు చేసింది. ఇప్పుడు వీటినే హైలెట్ చేస్తున్నారు కొందరు.

ఇదేం మొదటి సారి కాదు:
2014లోనూ దాదాపు ఇదే సీన్‌ రిపీట్ అయ్యింది. బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య జరిగిన ఆ మ్యాచ్‌లో చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో జడేజా ఉండగా.. బౌలర్‌గా ఆర్పీ సింగ్‌ ఉన్నాడు. అప్పటికే ఫోర్లు, సిక్సర్లతో జడేజా దాదాపు చెన్నై విజయాన్ని ఖాయం చేశాడు. లాస్ట్ బాల్‌కి 2 రన్స్ కొడితే చెన్నై గెలుస్తుంది. ఆఫ్‌ సైడ్‌ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన జడేజా థర్డ్‌ మ్యాన్‌ వద్ద దొరికిపోయాడు. అంతే లాంగాన్‌లో ఫిల్డింగ్‌ చేస్తున్న కోహ్లీ నుంచి టీవీలో మ్యాచ్‌ చూస్తున్న బెంగళూరు అభిమానుల వరకు ఆనందంతో ఒక్కసారిగా ఎగిరి దూకినంత పని చేశారు. కానీ అంపైర్ ఆ బాల్‌ను నో బాల్‌గా ప్రకటించాడు. అప్పటి ఆర్పీ సింగ్‌ ఓవర్‌ స్టెప్‌ నో బాల్ రచ్చ లేపింది. దీనిపై బెంగళూరు అభిమానులు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దానికి బలమైన కారణం కూడా ఉంది.. అదేంటో చూద్దాం.

అనేక ఆరోపణలు:
ఆర్పీ సింగ్‌ వేసిన నో బాల్‌పై అప్పట్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆర్పీ సింగ్‌ ధోనీకి ఫ్రెండంటూ బెంగళూరు ఫ్యాన్స్‌ అనేక ఆరోపణలు చేశారు.నిజానికి ధోనీకి ఆర్పీ సింగ్‌ చాలా మంచి ఫ్రెండ్..! ‌ అయితే.. అంతమాత్రానా అలా చేయాల్సిన పని ఏముంది? ధోనీకి క్రికెట్‌లో చాలామంది ఫ్రెండ్సే ఉన్నారు.. ఇది పూర్తిగా ఓడిపోయిన బాధతో చేసిన ఆరోపణగా చాలా మంది కొట్టిపారేశారు..! కానీ..ఆర్పీ సింగ్‌కు సంబంధించిన క్రికెట్ వ్యవహారాలను అప్పట్లో రీతూ స్పోర్ట్స్‌ చూసుకునేది. రీతూ స్పోర్ట్స్‌ ధోనీకి చెందింది. దీన్నిపై పలువురు ప్రశ్నించారు. కానీ దేనికీ సాక్ష్యాలు లేవు..! ఇదంతా అభిమానుల ఊహలు మాత్రమే! కానీ బెట్టింగ్‌, ఫిక్సింగ్‌ ఆరోపణలతో చెన్నై, రాజస్థాన్ జట్లను రెండేళ్ల పాటు ఐపీఎల్‌ నుంచి నిషేధించారు. అది వేరే విషయం..!

రెండుసార్లూ చెన్నై సూపర్ కింగ్స్‌కే కలిసొచ్చిన నో బాల్:
అప్పటి ఆర్పీ సింగ్ నో బాల్‌కు చెన్నై విజయం సాధిస్తే..నిన్నటి నో బాల్‌లో ధోనీ టీమ్‌కు సెకండ్‌ ప్లేస్‌ పొజిషన్‌ దాదాపు ఫీక్స్‌ ఐనట్లు కనిపిస్తుంది. నిన్న రాజస్థాన్ గెలిచి ఉంటే 12పాయింట్లు వచ్చి ఉండేవి. తర్వాత మ్యాచ్‌ల్లో చెన్నై ఓడిపోయి.. లక్నో, రాజస్థాన్‌ విజయాలు సాధిస్తే చెన్నై టీమ్‌ని దాటి ఈ రెండు జట్లలో ఒకటి రెండో స్థానానికి చేరుకునేవి. ఫ్లే ఆఫ్‌కు చేరిన జట్లలో మొదట రెండు స్థానాల్లో నిలిచే జట్లకు ఒక ప్రయోజనం ఉంటుంది. ప్లే ఆఫ్‌లో ఆడే తొలి మ్యాచ్‌లో ఓడిపోయినా ఫైనల్‌ చేరేందుకు మరో ఆవకాశముంటుంది. ఇక ఈ ఏడాది ధోనీకి చివరి సీజన్‌ అన్న ప్రచారం జరుగుతుండడంతో అతని కోసమే ఈ ఐపీఎల్‌ స్క్రిప్ట్ రాశారాంటూ పలువురు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.. అందుకే కామెంటేటర్లు కూడా ధోనీ భజన చేస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఐపీఎల్‌లో మరో మ్యాచ్‌ స్క్రిప్ట్ తరహాలోనే సాగడం అభిమానులకు కావాల్సినంత కిక్కిచ్చింది.