IPL 2023: కొత్తగా సరికొత్తగా ఐపీఎల్..ఆ రూల్ తో ఇక మరింత మజా..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్..ప్రపంచ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన టోర్నీ. స్వదేశీ, విదేశీ స్టార్ ఆటగాళ్ళ క్రికెటింగ్ యాక్షన్ తో అభిమానులను రెండున్నర నెలల పాటు వినోదమే వినోదం.. మరోసారి ఫ్యాన్స్ ను అలరించేందుకు ఐపీఎల్ సీజన్ వచ్చేసింది. అయితే ఈ సారి ఎంటర్ టైన్ మెంట్ కాస్త ఎక్కువ డోస్ లోనే ఉండబోతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 22, 2023 | 04:00 PMLast Updated on: Mar 22, 2023 | 4:00 PM

Ipl 2023 New Rules

గత సీజన్ లోనే 10 జట్లతో అలరించిన ఈ లీగ్ కు ఈసారి కొన్ని కొత్త రూల్స్ ఎంట్రీ ఇచ్చాయి. వాటిలో ప్రధానం ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం తుది జట్టులో లేని ఓ ఆటగాడిని మ్యాచ్ ప్రారంభమయ్యాక బరిలోకి దించవచ్చు. అతను బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయవచ్చు. మ్యాచ్ పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే ఈ ఇంపాక్ట్ ప్లేయర్‌ పేరును అంపైర్లకు ఇవాల్సి ఉంటుంది. ప్రతి ఇన్నింగ్స్ లో 14వ ఓవర్ పూర్తయ్యేలోపు ఈ రూల్ ను బ్యాటింగ్, బౌలింగ్ జట్లు ఉపయోగించుకోవచ్చు. అయితే ఆ నిర్ణయాన్ని తప్పనిసరిగా ఫీల్డ్ అంపైర్ కు చెప్పాలి. ఇంపాక్ట్ ప్లేయర్ జట్టులోకి వస్తే బయటకు వెళ్లిన ప్లేయర్ మళ్లీ ఆడటానికి వీలు ఉండదు. ఇటీవలే బీసీసీఐ ప్రయోగాత్మకంగా ఈ రూల్ ను సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ప్రవేశపెట్టింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే ఆటగాడు భారత్ కు చెందిన వాడే అయి ఉండాలి. ఒకవేళ తుది జట్టులో నలుగురి కంటే తక్కువ విదేశీ ప్లేయర్లు ఆడితే.. అప్పుడు అరుదైన సందర్భాలలో మాత్రమే ఇంపాక్ట్ ప్లేయర్ గా విదేశీ ఆటగాడిని ఆ జట్టు ఎంచుకోవచ్చు.

ఇదిలా ఉంటే ఈ సారి ప్రతీ జట్టుకు మూడు రివ్యూలు కేటాయించారు. వైడ్, నోబాల్‌కు కూడా రివ్యూ తీసుకోవచ్చు. ఇప్పటికే ఈ నిబంధనను వుమెన్స్ ప్రీమియర్ లీగ్ అమలు చేశారు. గతంలో వైడ్, నోబాల్స్ విషయంలో అంపైర్లు తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్ ఫలితాలపై తీవ్రంగానే ప్రభావం చూపడంతో ఈ రూల్ ను తీసుకొచ్చారు. అటు కోవిడ్ దెబ్బకు గత మూడు సీజన్లు బయో బబుల్ లోనే కఠిన నిబంధనల మధ్య అది కూడా పరిమితమైన వేదికల్లోనే నిర్వహించారు. దుబాయ్ వేదికగా 2020, 21 సీజన్లు జరగ్గా ..2022 మాత్రం ముంబైలోని నాలుగు వేదికలుగా నిర్వహించారు. అయితే ఇప్పుడు కోవిడ్ ప్రభావం తగ్గిపోయిన నేపథ్యంలో పాత పద్దతిలో హోమ్ అండ్ అవే ఫార్మాట్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ప్రతీ జట్టు సొంతమైదానంలో 7 మ్యాచ్‌లు.. బయటి వేదికల్లో మరో 7 మ్యాచ్‌లు ఆడనున్నాయి. అయితే కోవిడ్ కేసులు ఇటీవల పెరుగుతుండడంతో ఫ్రాంచైజీలకు బీసీసీఐ కీలక ఆదేశాలిచ్చింది. ఒకవేళ ఎవరైనా ఆటగాడికి కరోనా సోకితే వారం రోజులు ఐసోలేషన్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. మొత్తం మీద ఇంపాక్ట్ ప్లేయర్ , నో బాల్, వైడ్ బాల్స్ కు రివ్యూలతో ఈ సారి ఐపీఎల్ సీజన్ మరింత మజా ఇవ్వబోతోంది.