ఈడెన్ లోనే ధనాధన్ షురూ ఐపీఎల్ 2025 షెడ్యూల్ ఇదే
క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. ఊహించినట్టుగానే మార్చి 22న తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది. ఊహించినట్టుగానే మార్చి 22న తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కత్తా నైట్ రైడర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు కోల్ కత్తా ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది. రెండో మ్యాచ్ తోనే సన్ రైజర్స్ హైదరాబాద్ తన క్యాంపెయిన్ ను మొదలుపెట్టనుంది. మార్చి 23న సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కు ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. ఇక మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ మార్చి 23వ తేదీ ఆదివారం రాత్రి చెన్నై వేదికగా నిర్వహించనున్నారు. అంటే మార్చి 23వ తేదీన రెండు మ్యాచులు జరగబోతున్నాయి. దీని ప్రకారం సీజన్ ఆరంభమైన రెండోరోజే డబుల్ బొనాంజా ఫ్యాన్స్ కు కిక్ ఇవ్వనుంది.
ఈ సారి దేశవ్యాప్తంగా 13 వేదికల్లో ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. మార్చి 22 నుంచి మే 18 వరకూ లీగ్ మ్యాచ్ లు జరగనుండగా… మే 20 నుంచి ప్లే ఆఫ్స్ మొదలవుతాయి. మే 25న జరిగే ఫైనల్ కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిస్తోంది. 18వ సీజన్ మొత్తం 65 రోజుల పాటు జరగనుండగా..74 మ్యాచ్ లు ఫ్యాన్స్ ను అలరించనున్నాయి. ఈ సారి తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్ కు బీసీసీఐ బంపరే ఆఫర్ ఇచ్చిందనే చెప్పాలి. హైదరాబాద్ లో సన్ రైజర్స్ 7 హోం మ్యాచ్ లతో పాటు ప్లే ఆఫ్స్ లో రెండు మ్యాచ్ లకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వబోతోంది. అలాగే విశాఖపట్నం వేదికగా ఈ సారి సీజన్ లో రెండు ఐపీఎల్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2025లో తన తొలి రెండు మ్యాచ్ లను విశాఖలో ఆడబోతోంది.
ఈ సారి మూడు ఫ్రాంచైజీలు రెండు హోం గ్రౌండ్స్ లో మ్యాచ్ లు ఆడబోతున్నాయి. పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచులను ధర్మశాలలో ఆడనుండగా… నాలుగు మ్యాచ్ లను చండీఘర్ ఆడుతుంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు మ్యాచ్ లు హోమ్ గ్రౌండ్ వేదికగా ఢిల్లీలోనూ, రెండు మ్యాచ్ లను రెండు మ్యాచ్ లు విశాఖపట్నంలో ఆడేలా షెడ్యూల్ ప్లాన్ చేసుకుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ జైపూర్ వేదికగా ఐదు , గౌహతి వేదికగా రెండు మ్యాచ్ లను హోం గ్రౌండ్ ఆప్షన్ గా ఎంచుకుంది. సమ్మర్ హాలిడేస్ కావడంతో పాటు ఐపీఎల్ వినోదాన్ని అన్ని ప్రధాన నగరాలకు అందించాలన్న లక్ష్యంతోనే బీసీసీఐ 13 వేదికలను ఈ సీజన్ కోసం నిర్ణయించింది. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 12 రోజుల్లో ఐపీఎల్ సీజన్ మొదలుకానుంది. అయితే లీగ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్ లకు న్యూజిలాండ్ క్రికెటర్లు అందుబాటులో ఉండడంపై సందిగ్ధత నెలకొంది. ఈ సమయంలో పాక్ జట్టు కివీస్ పర్యటనకు వస్తుండడమే దీనికి కారణం. మే 25న ఫైనల్ జరగనుండగా… దాదాపు అంతర్జాతీయ సిరీస్ లతో క్లాష్ కాకుండా షెడ్యూల్ ను ఫిక్స్ చేశారు.