2024 IPL play off race : రసవత్తరంగా ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్.. రేసులో నిలిచిన బెంగుళూరు , ఢిల్లీ , గుజరాత్, లక్నో
ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఫస్టాఫ్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన జట్లు సెకండాఫ్‌లో పుంజుకోవడంతో ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిపోయింది.

IPL play off race.. Bengaluru, Delhi, Gujarat, Lucknow in the race
ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ సెకండాఫ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఫస్టాఫ్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన జట్లు సెకండాఫ్‌లో పుంజుకోవడంతో ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిపోయింది. ఇప్పటి వరకూ ఒక్క టీమ్ కూడా ప్లే ఆఫ్‌కు క్వాలిఫై కాలేదు. కోల్‌కతా, రాజస్థాన్ రాయల్స్ జట్లు 16 పాయింట్లతో ఉన్నా అధికారికంగా ప్లే ఆఫ్‌కు చేరుకోలేదు. అదే సమయంలో ముంబై ఇండియన్స్ , పంజాబ్ కింగ్స్ మాత్రమే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ప్లే ఆఫ్ రేసులో ఇంకా 8 జట్లు నిలిచాయి. ప్రస్తుతం ప్లే ఆఫ్ ఈక్వేషన్స్ చూస్తే కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ చేరడం దాదాపు ఖాయమే. ఈ రెండు జట్లు టాప్ 2లో లీగ్ స్టేజ్‌ను ముగించే అవకాశముంది.
మరోవైపు ఈ సీజన్‌లో పరుగుల వరద పారిస్తూ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా టాప్ 2లో చోటు దక్కించుకునేందుకు ఎదురుచూస్తోంది. ప్రస్తుతం సన్‌రైజర్స్ 12 మ్యాచ్‌లలో ఏడు విజయాలతో 14 పాయింట్లు సాధించి మూడో స్థానంలో కొనసాగుతోంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే లీగ్ స్టేజ్‌ను మొదటి రెండు స్థానాల్లో ముగించే అవకాశం కూడా హైదరాబాద్‌కు ఉంది. ఇక చెన్నై సూపర్‌కింగ్స్ 12 మ్యాచ్‌లలో 6 విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి ఒకవిధంగా ఆ జట్టు కాన్ఫిడెన్స్‌ను తగ్గించిందనే చెప్పాలి. మిగిలిన రెండింటిలో గెలిస్తే 16 పాయింట్లతో దర్జాగా ప్లే ఆఫ్‌లో అడుగుపెడుతుంది.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ , లక్నో, బెంగళూరుతో పాటు గుజరాత్‌కు కూడా ప్లే ఆఫ్ అవకాశాలు మిగిలి ఉన్నా… మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే ప్లే ఆఫ్‌కు క్వాలిఫై కావాలంటే ఆయా జట్ల రన్‌రేట్ కూడా కీలకం కానుంది. ఈ మూడు జట్లకూ ఇంకా రెండేసి మ్యాచ్‌లు మిగిలి ఉండగా వాటిలో విజయాలు తప్పనిసరి. చెన్నై గుజరాత్‌పై ఓడిపోవడం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వరంలా మారింది. ఫస్టాఫ్‌లో తీవ్రంగా నిరాశపరిచిన ఆర్‌సీబీ సెకండాఫ్‌లో మాత్రం వరుస విజయాలతో అదరగొడుతోంది. మిగిలిన జట్ల ఫలితాలు కూడా అనుకూలిస్తే ఆర్‌సీబీ ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టే అవకాశముంటుంది. అయితే చివరి లీగ్ మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్ బెర్తులపై తీవ్రమైన పోటీనే ఉండనుంది.