WTC final: మీ ఇద్దరు ఐపీఎల్ ఆడుకోండి.. టీమిండియాలో మీకేం పని? మన కొంపకొల్లేరు చేసింది ఎవరంటే..?
ఐపీఎల్‌లో పులిలా.. టీమిండియా తరుఫున పిల్లిలా ఆడుతున్న ఇద్దరి ఆటగాళ్ల గురించి తెలుసు కదా? ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆ ఇద్దరి ఆట చూసిన అభిమానులకు ఒళ్లు మండిపోతోంది.
ఐపీఎల్‌లో అతను కొడితే ఫోరూ లేకపోతే సిక్సూ..! మరో ఆటగాడు ఏమో.. కొడితే ఫిఫ్టీ లేకపోతే సెంచరీ..! అక్కడంతా చిన్న గ్రౌండ్లు.. అప్పుడప్పుడే కాంపిటేటివ్ క్రికెట్‌లో అడుగుపెడుతున్న బౌలర్లు.. ఇంకా రెచ్చిపోయేందుకు అంతకంటే ఛాన్స్ ఏముంటుంది. కానీ ఇంటర్నెషనల్ క్రికెట్ స్థాయి వేరు.. అక్కడి పిచ్‌లు వేరు.. గ్రౌండ్లు వేరు.. ప్రత్యర్థులు వేరు..అన్నీటికంటే ముఖ్యంగా అక్కడ బౌలర్లు వేరు..! మన పప్పులు అక్కడ ఉడకవ్..!అందుకే ఆ ఇద్దరు తేలిపోయారు.. ఫైనల్‌లో తస్సుమన్నారు..! ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన కోహ్లీ, గిల్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఉసూరుమనిపించారు.
రెండు నెలల పాటు ప్రేక్షకులను కట్టి పడేసిన ఐపీఎల్‌లో టీమిండియా యువ సంచలనం శుభమన్‌గిల్, కింగ్ కోహ్లీ అదిరిపోయే ఆటతో అద్భుతమనిపించారు. గిల్ ఎడాపెడా సెంచరీలు కూడా బాదాడు. ప్లేఆఫ్‌లోనూ దుమ్మురేపాడు. అటు కోహ్లీ సైతం ఆరంభ మ్యాచ్‌ల్లో తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఫిఫ్టీలు చేసినా తర్వాత మాత్రం భారీ హిట్టింగ్ చేసి అభిమానుల చేత కింగ్ ఇజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. అదంతా పొట్టి ఫార్మెట్‌లో మనొళ్ల సత్తా..! ఇప్పుడు ఓడిపోయింది, తేలిపోయిందీ, తుస్సుమన్నది అసలుసిసలైన ఫార్మెట్ టెస్టుల్లో..! అంతే ఏ ఫార్మెట్ స్టాండర్డ్ దానిదే..! అక్కడ బౌలర్లను చీల్చిచెండాడిన గిల్.. ఇక్కడ బ్యాట్ ఎత్తి క్లిన్ బౌల్డ్ అయ్యాడు. అసలు అదేదో వింత బంతిలాగా.. ఆస్ట్రేలియా ఏదో బాల్ టాంపరింగ్ చేసి వికెట్ తీసినట్టు ఫేస్ ఎక్స్‌ప్రెషన్ పెట్టాడు. ఓవల్ లాంటి పిచ్‌లపై అలాంటి బంతులు కామన్‌గానే వస్తాయి. తొలి ఇన్నింగ్స్‌లో 13పరుగులు చేసిన గిల్..రెండో ఇన్నింగ్స్‌లో 18రన్స్ చేశాడు. అంటే రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 31పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో మూడు సెంచరీలు చేసిన గిల్ ఇక్కడ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 50పరుగులు కూడా చేయలేకపోయాడు.
అటు ఛేజ్ మాస్టర్‌గా క్రికెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కోహ్లీ.. బిగ్ గేమ్స్‌లో మాత్రం చోక్ మాస్టర్‌గా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2015 వరల్డ్ కప్ సెమీస్, 2017 ఛాంపియన్స్‌ట్రోఫీ పైనల్, 2019వన్డే వరల్డ్ కప్ సెమీస్, WTCఫైనల్స్.. ఇలా ప్రతిసారి ప్రధాన మ్యాచ్‌ల్లో కోహ్లీ ఫ్లాప్ అవుతున్నాడు. అటు రెండు వారాల క్రితమే ముగిసిన ఐపీఎల్‌లోనూ కోహ్లీ సత్తా చాటాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో మాత్రం ఆసీస్‌పై తేలిపోయాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ముక్కుతూ ములుగుతూ 14పరుగులు చేసిన కోహ్లీ..రెండో ఇన్నింగ్స్‌లో 49రన్స్ చేశాడు.
ఈ 49ని చూపించి బాగా ఆడాడు అని కోహ్లీ ఫ్యాన్స్ చెప్పుకోవచ్చు కానీ..అది అతని స్థాయి ఆట కాదు.. అది కూడా నాలుగో రోజు చివరి సెషన్ బ్యాటింగ్‌కి అనుకూలించింది.. అందుకే ఆ సెషన్‌లో 44రన్స్ చేయగలిగాడు..చివరి రోజు తొలి సెషన్‌లో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మరో ఐదు పరుగులు మాత్రమే చేసి బొలాండ్‌కి దొరికిపోయాడు. ఇది ఐపీఎల్ కాదు..చిన్నస్వామి పిచ్ అంతకన్న కాదు… కోహ్లీ ఒకప్పుడు మంచి ప్లేయరే కావొచ్చు..కానీ టెస్టుల్లో మాత్రం వన్డే తరహా లెజెండ్ కాదు.. మూడేళ్లగా టెస్టుల్లో అతని ఆట మరింత తీసికట్టుగా మారుతోంది. ఇలా ఐపీఎల్‌లో మాత్రమే అదరగొట్టే స్టార్లు..టీమిండియాకు మాత్రం విఫలమవుతున్నారు. రానున్న వరల్డ్ కప్ టైమ్‌కి మాత్రం ఇలా జరగకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.