ప్రాణాపాయ స్థితిలో క్రికెటర్ కాలేయ మార్పిడికి సిద్ధం
ఐర్లాండ్ టాప్ క్రికెటర్ సిమ్రన్‌జిత్ సింగ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతడి కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం.
ఐర్లాండ్ టాప్ క్రికెటర్ సిమ్రన్‌జిత్ సింగ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతడి కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడు గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సిమ్రన్‌జిత్‌కు కాలేయ మార్పిడి జరుగనుందని జాతీయ మీడియా వెల్లడించింది. సిమి సింగ్‌గా ప్రసిద్ధి చెందిన సిమ్రన్‌జిత్ సింగ్ మొహాలిలో జన్మించాడు. అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2005లో హోటల్ మేనేజ్‌మెంట్ చదివేందుకు ఐర్లాండ్‌కు వెళ్ళి అక్కడ ప్రొఫెషనల్ క్రికెటర్ గా మారాడు. 2017లో ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ జట్టులో టాప్ క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న సిమ్రన్ జీత్ సింగ్ 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.