ఆ రూ. 86 కోట్లు బొక్కేనా ? సన్ రైజర్స్ టీంపై ట్రోలింగ్
ఐపీఎల్ 18వ సీజన్ లో భారీ అంచనాలు పెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది.

ఐపీఎల్ 18వ సీజన్ లో భారీ అంచనాలు పెట్టుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది. మొన్నటి వరకూ ఏదైతే తమ బలంగా భావించిందో ఇప్పుడు అదే వారికి బలహీనతగా మారిపోయింది. కోట్ల రూపాయలు వెచ్చించి రిటైన్ చేసుకున్న ఐదురుగు ఆటగాళ్ళు తేలిపోతున్నారు. వీరికి తోడు వేలంలో 11 కోట్లకు పైగా పెట్టి కొన్న ఇషాన్ కిషన్ కూడా నిరాశపరుస్తున్నాడు. నిజానికి గత సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట ఓ రేంజ్ లో కనిపించింది. మైదానంలోకి ఆరెంజ్ ఆర్మీ వచ్చిందంటే చాలు భారీస్కోర్లు నమోదయ్యాయి. ప్రత్యర్థి బౌలర్లపై కనికరం కూడా లేకుండా ఆ ఐదుగురు విరుచుకుపడ్డారు. భారీస్కోర్లతో గత సీజన్ అంతా రికార్డుల మోత మోగింది. టైటిల్ తృటిలో చేజారినా ఓవరాల్ గా మంచి బ్యాటింగ్ లైనప్ తో తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది సన్ రైజర్స్ టీమ్… ఈ ప్రదర్శనతోనే సన్ రైజర్స్ ఓనర్ కావ్యామారన్ హెడ్ , క్లాసెన్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డిలతో పాటు ప్యాట్ కమ్మిన్స్ ను రిటైన్ చేసుకుంది.
ఆ ఐదుగురి కోసం కావ్య పాప.. ఏకంగా 75 కోట్లు ఖర్చు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మొదటగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం 18 కోట్లు వెచ్చించింది. దూకుడు బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కోసం 23 కోట్లు వెచ్చించింది. విధ్వంసకర ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కోసం చెరో 14 కోట్లు ఖర్చు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి కోసం రూ.6 కోట్లు ఇచ్చింది. అలా మొత్తంగా ఈ ఐదుగురి కోసమే పర్సులో నుంచి రూ.75 కోట్లు వెచ్చించింది. ఇక ఇషాన్ కిషన్ కోసం మెగా వేలంలో 11.25 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఈ ఆరుగురు ఆటగాళ్లతోనే సన్ రైజర్స్ బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉందనుకున్నారు. వీరిలో ఏ ముగ్గురు చెలరేగినా ప్రతి మ్యాచ్ లోనూ 200 ప్లస్ స్కోర్ ఖాయమని అంచనాలు వేశారు. నిజానికి ఈ ఆరుగురికీ ఆ సత్తా ఉంది.. తమదైన రోజున వీరెవరినీ ఆపడం ఏ బౌలర్ వల్లా కాదు. తొలి మ్యాచ్ లోనే సెంచరీతో ఇషాన్ కిషన్ సైతం దానిని నిరూపించాడు. కానీ తొలి మ్యాచ్ తర్వాత వీళ్లంతా కలిసి కావ్య పాపతో పాటు అభిమానుల అంచనాలను బోల్తా కొట్టించారు. ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడితే కేవలం రెండు మ్యాచుల్లోనే 200 స్కోరు చేశారు. అందులో ఒకటి తొలి మ్యాచులో 286 పరుగులు. ఆ తర్వాత మూడు మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్, ఛేజింగ్ లో ప్రత్యర్థులు పూర్తి ఓవర్లు కూడా ఆడకుండానే మ్యాచ్ లను ఫినిష్ చేసారు.
తాజాగా గుజరాత్ టైటాన్స్ పై హోంగ్రౌండ్ లోనే చిత్తుగా ఓడిన తర్వాత సన్ రైజర్స్ ఆట మరింత దిగజారిపోయిందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆరుగురు ఆటగాళ్ల కోసం కావ్య మారన్ ఖర్చు చేసిన 86.25 కోట్లు మొత్తం వృథా అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. అలానే ఆ ఆటగాళ్ల కోసం కావ్య మారన్ అంత మొత్తం పెట్టడం కరెక్టా కాదా అంటూ చర్చ కూడా జరుగుతోంది. అభిషేక్ శర్మ ఐదు మ్యాచుల్లో కేవలం 51 పరుగులే చేశాడు. ఇతడి కన్నా బౌలర్ కమ్ కెప్టెన్ ప్యాట్ కమిన్సే ఐదు మ్యాచుల్లో ఎక్కువ స్ట్రైక్ రేట్ తో ఎక్కువ పరుగులు 56 రన్స్ చేశాడు. క్లాసెన్ ఐదు మ్యాచుల్లో 152 పరుగులు చేయగా.. అందులో అతడి అత్యధిక స్కోరు 34. అంటే ఒక్క మ్యాచుకు యావరేజ్ గా 30 పరుగులు చేశాడు. కానీ జట్టును గెలిపించే ఇన్నింగ్స్ ను మాత్రం ఆడలేదు. ఇక ఇషాన్ కిషన్ తొలి మ్యాచులో సెంచరీ చేయడంతో విజయం సాధించింది. లేదంటే ఆ విజయం కూడా దక్కేది కాదు. అయినా ఇషాన్ కిషన్ ఆ తర్వాతి మ్యాచులలో విఫలమైపోయాడు. నాలుగు మ్యాచుల్లో కలిపి 21 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో కావ్యా పాపకు 86 కోట్లు వేస్ట్ అయినట్టేనంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. కాగా గుజరాత్ పై టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేసింది. నితీశ్ రెడ్డి 31,క్లాసెన్ 27, కమిన్స్ 22 పరుగులు మినహా మిగతా వారెవరూ పెద్దగా రాణించలేదు. గుజరాత్ బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో చెలరేగాడు. ప్రస్తుతం నాలుగు వరుస ఓటములతో సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.