Ishan Kishan : చేజేతులా కెరీర్‌ నాశనం చేసుకుంటున్న ఇషాన్‌..

ఇషాన్ కిషన్.. టీమిండియా క్రికెటర్ పేరు సోషల్ మీడియాలో మళ్లీ మారుమోగిపోతోంది. ఎందుకంటే.. ఇంగ్లండ్‌తో జరిగే మిగతా మూడు టెస్టులకు ఇషాన్‌ పేరును పరిశీలించలేదు బీసీసీఐ. ఇంతకీ ఇషాన్‌ కిషన్‌కు ఏమైంది. కాల్‌ కూడా ఎందుకు లిఫ్ట్‌ చేయడం లేదు. ఎవరి మీదో అలకను ఇంకొకరిపై చూపిస్తే.. కెరీర్‌పై ఎఫెక్ట్ పడదా అనే చర్చ నడుస్తోంది

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2024 | 02:58 PMLast Updated on: Feb 11, 2024 | 2:58 PM

Ishaan Is Ruining His Career

ఇషాన్ కిషన్.. టీమిండియా క్రికెటర్ పేరు సోషల్ మీడియాలో మళ్లీ మారుమోగిపోతోంది. ఎందుకంటే.. ఇంగ్లండ్‌తో జరిగే మిగతా మూడు టెస్టులకు ఇషాన్‌ పేరును పరిశీలించలేదు బీసీసీఐ. ఇంతకీ ఇషాన్‌ కిషన్‌కు ఏమైంది. కాల్‌ కూడా ఎందుకు లిఫ్ట్‌ చేయడం లేదు. ఎవరి మీదో అలకను ఇంకొకరిపై చూపిస్తే.. కెరీర్‌పై ఎఫెక్ట్ పడదా అనే చర్చ నడుస్తోంది. ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు 17మంది ఆటగాళ్లతో భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. అంతా అనుకున్నదే జరిగింది. యువ వికెట్‌కీపర్ ఇషాన్ కిషన్‌ను పక్కనపెట్టేసింది బీసీసీఐ. దీంతో టాక్‌ ఆఫ్‌ ది సోషల్ మీడియాగా మారిపోయాడు ఇషాన్ కిషన్. కొన్నాళ్లుగా ఈ వికెట్‌ కీపర్ వ్యవహార శైలి ఎవరికీ అంతు చిక్కడం లేదు. సౌతాఫ్రికా టూర్‌లో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి అని చెప్పి జట్టుకు దూరమయ్యాడు. తర్వాత కుటుంబం, స్నేహితులతో గడిపాడు. మానసిక ఒత్తిడి అని చెప్పినా.. దుబాయ్‌లో ఓ పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు.

జితేశ్ శర్మను టీమ్‌లోకి తీసుకోవడం వల్లే ఇషాన్ అలిగాడని.. అందుకే దక్షిణాఫ్రికా నుంచి అర్ధాంతరంగా వచ్చేశాడని క్రికెట్‌ సర్కిల్‌లో అప్పట్లో టాక్ వినిపించింది. సౌతాఫ్రికా టూర్‌ నుంచి మధ్యలో వచ్చినప్పటి నుంచి… ఇప్పటి వరకు టీమిండియాకు అందుబాటులో లేకుండా పోయాడని.. కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్‌ చేయడం లేదని టాక్. దీంతో.. అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఇషాన్‌ను ఎంపిక చేయలేదు టీమ్‌ మేనేజ్‌మెంట్. ఇదే రీజన్‌తో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌కు కూడా ఈ యువ వికెట్ కీపర్‌ను పక్కనపెట్టారు సెలెక్టర్లు. ఇంగ్లండ్‌ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లకు సెలక్ట్‌ చేయకున్నా.. మూడో టెస్ట్‌కు టీమ్‌లోకి తీసుకుందామనుకున్నారు. కానీ.. తాజాగా అనౌన్స్ చేసిన స్క్వాడ్‌లో ఇషాన్ పేరు లేదు. అతడి మెుండి పట్టుదల వల్లే చివరికి ఇలా టీమ్‌కు దూరమయ్యాడనే వినిపిస్తోంది.

సౌతాఫ్రికా ఎపిసోడ్ తర్వాత.. దేశవాళీ క్రికెట్‌ ఆడి తిరిగి టీమ్‌లోకి రావాలని కోచ్ రాహుల్‌ ద్రవిడ్ చెప్పినా.. ఆ మాటలను పెడచెవిన పెట్టాడీ వికెట్‌ కీపర్. అందుకే జట్టులోకి తీసుకోలేదనే వాదన వినిపిస్తోంది. అటు రంజీ మ్యాచ్‌లైతే ఆడలేదు కానీ.. ఐపీఎల్ కోసం ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్‌ కప్ ఉంది. దీంతో.. టీ20లపైనే ఇషాన్ కాన్‌సన్‌ట్రేషన్‌ చేసాడనే వాదనా వినిపిస్తోంది. మ‌రీ ఐపీఎల్‌లో అత‌డు సత్తా చాటితే టీమ్ఇండియాలో చోటు ల‌భిస్తుందా లేదా అన్నది చూడాల్సిందే. ఎందుకంటే ఇక ఇషాన్ కిషన్‌ కెరీర్‌ ముగిసిందన్నట్లుగా కొందరు సీనియర్లు స్టేట్‌మెంట్‌లిస్తున్నారు. నిజంగానే ఇషాన్ కెరీర్ ముగిసిపోయిందా.. అలక, మొండితనం కొంపముంచిందా అనే చర్చ జరుగుతోంది.