ISHAN KISHAN : మనసు మార్చుకున్న ఇషాన్ కిషన్

సౌతాఫ్రికా టూర్‌ (South Africa Tour) నుంచి పత్తా లేకుండా పోయిన టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్‌ కిషన్‌ మనసు మార్చుకున్నాడు. మనసు బాగోలేదంటూ ఇంకా కాకమ్మ కబుర్లు చెబితే... ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తుందని... బీసీసీఐ (BCCI) ఇచ్చిన షాక్ ట్రీట్‌మెంట్‌ బాగా పనిచేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 14, 2024 | 09:25 AMLast Updated on: Feb 14, 2024 | 9:25 AM

Ishan Kishan Changed His Mind

సౌతాఫ్రికా టూర్‌ (South Africa Tour) నుంచి పత్తా లేకుండా పోయిన టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్‌ కిషన్‌ మనసు మార్చుకున్నాడు. మనసు బాగోలేదంటూ ఇంకా కాకమ్మ కబుర్లు చెబితే… ఇంటికే పరిమితం అవ్వాల్సి వస్తుందని… బీసీసీఐ (BCCI) ఇచ్చిన షాక్ ట్రీట్‌మెంట్‌ బాగా పనిచేసింది.

మానసిక అలసట పేరు చెప్పి… ఆటకు, టీమ్‌కు దూరంగా ఉంటున్న క్రికెటర్ ఇషాన్ కిషన్‌ (Ishan Kishan) మళ్లీ గ్రౌండ్‌లోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. సౌతాఫ్రికా టూర్‌ నుంచి మధ్యలోనే వైదొలిగాడు ఇషాన్. ఆ తర్వాత అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు అసలు ఎంపిక చేయలేదు. ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లకు పట్టించుకోలేదు. రంజీల్లో ఆడి టీమ్‌లోకి రావాలని మేనేజ్‌మెంట్ చెప్పిన మాటను పెడచెవిన పెట్టి… అడ్రస్‌ లేకుండా పోయాడు ఇషాన్ కిషన్. రంజీ ట్రోఫీ (Ranji Trophy) లో జార్ఖండ్ తరఫున ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతాడని భావించారంతా. కానీ ఇషాన్ రంజీలో ఆడటానికి ఆసక్తి చూపలేదు. ఐపీఎల్‌లో ఆడాలని ప్రాక్టీస్ ప్రారంభించాడు. అయితే.. అంతకు ముందే.. ముంబైలో జరిగే డీవై పటేల్ టోర్నమెంట్‌లో ఇషాన్ పాల్గొంటాడని తెలుస్తోంది.

అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయని ఇషాన్.. ఇప్పటికిప్పుడు మనసెందుకు మార్చుకున్నాడా అనే చర్చ క్రికెట్ సర్కిల్‌లో జరిగింది. అయితే.. బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవాళీ టోర్నీలో ఆటగాళ్లందరూ పాల్గొనాలని ఆదేశించింది. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతూ NCAలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్న వారికి మాత్రమే మినహాయింపు ఇచ్చింది. మిగతా ఆటగాళ్లంతా తప్పనిసరిగా ఆడాలని సూచించింది. బీసీసీఐ కొత్త రూల్‌తో ఇషాన్ కిషన్… డీవై పటేల్ టోర్నీలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు.
అంతే కాకుండా.. బీసీసీఐ మరో కొత్త నిబంధన కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ఆడాలంటే కనీసం 3-4 రంజీ మ్యాచ్‌లు ఆడేలా నిబంధనలు తీసుకురావడానికి బీసీసీఐ ప్రయత్నిస్తోంది.

భారత జట్టుకు దూరంగా ఉండే ఆటగాళ్లు ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్‌లో కొన్ని మ్యాచ్‌లు ఆడుతున్నారు. కానీ రంజీ ట్రోఫీ సమయంలో రాష్ట్ర జట్టుకు అందుబాటులో ఉండట్లేదు. ఇలాంటి ఆటగాళ్లను కట్టడిచేయడానికి రంజీ ట్రోఫీలో మూడు నుంచి నాలుగు మ్యాచ్‌లు ఆడటం తప్పనిసరిగా బీసీసీఐ చేస్తోంది. అలా రంజీ మ్యాచ్‌లు ఆడలేకపోతే వాళ్లు ఐపీఎల్ ఆడలేరు. ఐపీఎల్ వేలానికి కూడా అనర్హులవుతారు. ఇంకా బెట్టు చేస్తే మొదటికే మోసం వస్తుందని భావించిన ఇషాన్ కిషన్.. మెట్టు దిగిరాక తప్పలేదు. ఇప్పటికైనా బుద్ధిగా ఆట ఆడతాడా లేక.. ఫలానా ఆటగాన్ని ఎంపిక చేశారంటూ అలిగి పూర్తిగా ఇంటికెళ్తాడా అన్నది అతడి చేతుల్లోనే ఉంది.