ఇప్పటికి బుద్ధొచ్చిందా ? దేశవాళీ క్రికెట్ ఆడనున్న ఇషాన్ కిషన్
భారత క్రికెట్ జట్టులో చోటు కోసం ఎంత తీవ్రమైన పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు…గత కొన్నేళ్ళుగా ఒక్కో ప్లేస్ కోసం ఏకంగా ఐదుగురు కనీసం పోటీపడుతున్నారు.. అలాంటి పరిస్థితుల్లో జట్టులో చోటు దక్కినప్పుడు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సిందే… లేకుండా ప్లేస్ గల్లంతే.. అదే సమయంలో వ్యక్తిగత ప్రవర్తన కూడా ముఖ్యమే… మరీ ముఖ్యంగా క్రమశిక్షణ లేకుంటే కెరీర్ ముగిసిపోతుంది. తాజాగా ఇలాంటి పరిస్థితినే వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ఎదుర్కొన్నాడు. గత ఏడాది చివర్లో సౌతాఫ్రికా టూర్ నుంచి అర్థాంతరంగా వచ్చేసిన ఈ యువ క్రికెటర్ క్రమంగా జట్టులో చోటు కోల్పోయాడు.
దేశవాళీ క్రికెట్ ఆడమంటే ఫిట్ నెస్ కారణాలు చెప్పి తప్పించుకున్న ఇషాన్ బీసీసీఐ ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా పోగొట్టుకున్నాడు. దీంతో ఇప్పటికి బుద్ధి తెచ్చుకున్న ఈ యువ వికెట్ కీపర్ దేశవాళీ క్రికెట్ ఆడేందుకు రెడీ అయ్యాడు. బుచ్చి బాబు టోర్నమెంట్‌లో జార్ఖండ్ జట్టుకు కిషన్ సారథ్యం వహించనున్నాడు. ఈ విషయాన్ని జార్ఖండ్ స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించింది. కిషన్ బుధవారం చెన్నైలో ఉన్న తన జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది.
తొలుత కిషన్ ఈ టోర్నీకి దూరంగా ఉండాలని భావించాడు. ఇటీవల కొత్త కోచ్ గంభీర్ దేశవాళీ క్రికెట్ లో ఆడాల్సిందేనన్న ఆదేశాల నేపథ్యంలో ఇషాన్ తన నిర్ణయాన్ని మార్చకుని, ఈ బుచ్చిబాబు టోర్నీకి అందుబాటులో ఉంటానని జెఎస్‌సీఎకు తెలియజేశాడు. ఈ నేపథ్యంలోనే తమ జట్టు పగ్గాలను అతనికి అప్పగించినట్టు జార్ఖండ్ క్రికెట్ వర్గాలు తెలిపాయి.ఇక ఈ టోర్నీలో కిషన్ అద్భుతంగా రాణిస్తే భారత క్రికెట్‌లో తిరిగి పునరాగమనం చేసే అవకాశముంటుంది.