Bhumra: బుమ్రా తయ్యార్ ఐయామ్ రెడీ

గతేడాది ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత వెన్నునొప్పి పేరుతో సుమారు ఏడాదికాలంగా టీమ్‌కు దూరంగా ఉంటున్న స్టార్ పేసర్ జస్పీత్ బుమ్రా టీమిండియా ఫ్యాన్స్‌కు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 16, 2023 | 12:36 PMLast Updated on: Jul 16, 2023 | 12:36 PM

It Seems That India Is Ready To Take The Bowler Bumrah For The T20 Matches Between Ireland

ఈ ఏడాది ఫిబ్రవరిలో వెన్ను గాయానికి న్యూజిలాండ్‌లో శస్త్ర చికిత్స చేయించుకుని వచ్చిన బుమ్రా.. ఐపీఎల్ – 16, డబ్ల్యూటీసీ ఫైనల్స్ వంటి కీలక టోర్నీలకు దూరమయ్యాడు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో రీహాబిటేషన్ పొందుతున్న బుమ్రా.. త్వరలోనే టీమ్ లోకి రానున్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన కథనం ప్రకారం.. వచ్చే నెలలో భారత జట్టు ఐర్లాండ్ టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా అక్కడ మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌కు బుమ్రా కూడా అందుబాటులో ఉండనున్నట్టు తెలుస్తున్నది. శస్త్ర చికిత్స తర్వాత ఎన్సీఏలోనే ఫిట్నెస్ పెంపొందించుకుంటున్న బుమ్రా.. ఆసియా కప్ వరకు పూర్తి ఫిట్నెస్ సాధించి ఆ టోర్నీ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నా అనుకున్నదానికంటే ముందే అతడు ఫిట్ అవుతున్నట్టు సమాచారం.

ప్రస్తుతం ఎన్సీఎలో అతడు వరుసగా 8 నుంచి 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఆసియా కప్ కంటే ముందే భారత్.. ఐర్లాండ్‌తో మూడు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌లో బుమ్రాను ఆడించి ఆ తర్వాత ఆసియా కప్‌లో ఆడించాలని ఎన్సీఏ వర్గాలు బీసీసీఐ, సెలక్టర్లకు సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇవే నిజమైతే గనక అక్టోబర్ నుంచి జరుగబోయే వన్డే వరల్డ్ కప్ నాటికి బుమ్రా పూర్తిస్థాయిలో ఫిట్ అయి మునపటి లయను అందుకుంటే అది భారత జట్టుకు లాభించేదే అవుతుంది. బుమ్రా లేని లోటు భారత్‌కు గతేడాది ఆసియాకప్, టీ20 వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ వరల్డ్ కప్‌లో స్పష్టంగా తెలిసొచ్చింది.

బుమ్రాతో పాటు భారత జట్టు మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఎన్సీఎలోనే రీహాబిటేషన్ పొందుతున్న విషయం తెలిసిందే. అయ్యర్ కూడా గత మార్చిలో వెన్ను గాయానికి శస్త్ర చికిత్స చేయించుకుని టీమ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ సెషన్స్‌కు అటెండ్ అవుతున్న అయ్యర్.. ఆసియా కప్ వరకు కూడా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించేది అనుమానంగానే ఉంది. ఇదే విషయమై అయ్యర్ ఔట్ లుక్‌తో మాట్లాడుతూ.. ‘‘నేను ట్రైనింగ్ సెషన్స్‌కు వచ్చినప్పుడల్లా బయటనుంచి జనం ఫోటోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంతేగాక వాళ్లు ‘మీరు టీమ్ లోకి ఎప్పుడు తిరిగొస్తారు?’ అని అడుగుతున్నారు.

వాస్తవంగా చెప్పాలంటే నేనెప్పుడు పూర్తి స్థాయిలో కోలుకుంటాను..? మళ్లీ ఎప్పుడు టీమ్ లోకి రీఎంట్రీ ఇస్తాననేది నాకు కూడా స్పష్టంగా తెలియదు..’’అని తెలిపాడు. అయ్యర్ హెల్త్ అప్డేట్‌పై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘అయ్యర్ ప్రోగ్రెస్ స్లోగా ఉంది. కానీ వరల్డ్ కప్ వరకైనా అతడు పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తాడని మేం ఆశిస్తున్నాం..’అని చెప్పాడు.