ఇది కదా విరాట పర్వం, ఆసీస్ కు మైండ్ బ్లాంక్
రికార్డులు అతనికి కొత్త కాదు... ఒత్తిడిలో ఆడడం అంతకంటే కొత్త కాదు...పెద్ద జట్లపై పెద్ద ఇన్నింగ్స్ లు ఆడడం కూడా కొత్త కాదు.. కానీ చాలారోజులుగా బ్యాడ్ ఫేజ్ నడుస్తుండడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు..

రికార్డులు అతనికి కొత్త కాదు… ఒత్తిడిలో ఆడడం అంతకంటే కొత్త కాదు…పెద్ద జట్లపై పెద్ద ఇన్నింగ్స్ లు ఆడడం కూడా కొత్త కాదు.. కానీ చాలారోజులుగా బ్యాడ్ ఫేజ్ నడుస్తుండడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.. ఇక రిటైర్మెంట్ ఇచ్చేయొచ్చు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి… ఇలాంటి వాటిని పట్టించుకుంటే అతను విరాట్ కోహ్లీ ఎందుకవుతాడు.. ఒక్క దెబ్బకు ఈ విమర్శలన్నింటికీ బ్యాట్ తోనే జవాబిచ్చాడు.. రికార్డుల్లో తన పేరు ఉండడం కాదు.. రికార్డులే అతని పేరిట ఉంటాయి… అందుకే కదా విరాట్ ను రికార్డుల రారాజుగా పిలిచేది.
పాక్ తో మ్యాచ్ శతక్కొట్టి ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ ఇప్పుడు కీలకమైన సెమీఫైనల్లో దుమ్మురేపాడు. నిజానికి కోహ్లీ క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్లు మ్యాచ్ పై ఆశలు వదులుకోవాల్సిందే.. కానీ పేలవ ఫామ్ తో సతమతమైన విరాట్ వల్ల పెద్ద ప్రమాదమేమీ లేదని సెమీస్ లో ఆసీస్ భావించినట్టు కనిపించింది. అయితే ఛేజింగ్ లో తాను కింగ్ అన్న సంగతి మరోసారి రుజువు చేశాడు.
వన్డే ఫార్మాట్ కు తగ్గట్టు బ్యాటింగ్ చేసిన కోహ్లీ భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. 34 పరుగులకే ఓపెనర్లు ఔటైన తర్వాత ఏ జట్టుపై అయినా ఒత్తిడి ఉంటుంది… క్రీజులో ఉన్న తర్వాతి బ్యాటర్లు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే… అది కూడా దుబాయ్ లాంటి స్లో పిచ్ పై పరుగులు చేయాలంటే ఓపికే ముఖ్యం… భారీ షాట్లకు పోకుండా సింగిల్స్ తీస్తూ, స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ నిర్మించాల్సి ఉంటుంది… ఇలాంటి పరిస్థితులను ఎన్నోసార్లు తన కెరీర్ లో చూసిన విరాట్ కోహ్లీ సెమీఫైనల్లో క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. టీ ట్వంటీ ఫార్మాట్ లో ఫోర్లు, సిక్సర్లే కొట్టాలి… కానీ వన్డే ఫార్మాట్ లో సింగిల్స్ తీయడమే చాలా ముఖ్యం… పార్టనర్ షిప్స్ నెలకొల్పడం అంతకంటే ముఖ్యం.. ఇవి రెండు సరిగ్గా కుదిరితే ఇక గెలుపును ఎవరూ ఆపలేరు.
కోహ్లీ సెమీఫైనల్లో ఆసీస్ పై ఆడిన ఇన్నింగ్స్ ఇలాంటిదే…ఈ ఇన్నింగ్స్ ను మాస్టర్ క్లాస్ గా చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సెంచరీ చేజారినప్పటకీ కోహ్లీ చేసిమ 84 రన్స్ , శ్రేయాస్ అయ్యర్ తో నెలకొల్పిన 131 పరుగుల పార్టనర్ షిప్ భారత్ కు విజయాన్ని అందించింది. చివర్లో కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా మెరుపులు కూడా తోడవడంతో మరో 11 బాల్స్ మిగిలుండగానే ఇండియా గెలిచేసింది. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఫెయిలైన తర్వాత కాస్త విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఇప్పుడు నాకౌట్ మ్యాచ్ లో అదరగొట్టి తన స్టామినా ఎలాంటిదో చాటి చెప్పాడు. సెంచరీ కంటే తనకు జట్టు గెలుపే ఆనందానిస్తుందని గతంలో ఎన్నోసార్లు చెప్పిన విరాట్ మ్యాచ్ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకున్నాడు. సహచరులను అభినందిస్తూ తనదైన స్టైల్ లో సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. మొత్తం మీద విరాట్ దెబ్బకు కంగారూల మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇక ఫైనల్లోనూ విరాట పర్వం కొనసాగితే టీమిండియా మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం కష్టం కాదు.