Ravindra Jadeja: జడేజా రికార్డుల జాతర.. విండీస్ దిగ్గజ రికార్డు సమం
జడ్డూ ఇప్పటివరకు విండీస్‌పై వన్డేల్లో 44 వికెట్లు పడగొట్టాడు. తొలి వన్డేలో మూడు వికెట్స్ పడగొట్టడంతో భారత దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును రవీంద్ర జడేజా బద్దలు కొట్టాడు. విండీస్‌పై వన్డేల్లో కపిల్ దేవ్ 43 వికెట్లు పడగొట్టగా.. జడేజా 44 వికెట్లు తీశాడు

Ravindra Jadeja: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు సాధించాడు. వన్డే ఫార్మాట్లో వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. గురువారం బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో మూడు వికెట్లతో చెలరేగిన జడేజా.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. జడ్డూ ఇప్పటివరకు విండీస్‌పై వన్డేల్లో 44 వికెట్లు పడగొట్టాడు.
తొలి వన్డేలో మూడు వికెట్స్ పడగొట్టడంతో భారత దిగ్గజం కపిల్ దేవ్ రికార్డును రవీంద్ర జడేజా బద్దలు కొట్టాడు. విండీస్‌పై వన్డేల్లో కపిల్ దేవ్ 43 వికెట్లు పడగొట్టగా.. జడేజా 44 వికెట్లు పడగొట్టి కొత్త రికార్డు నెలకొల్పాడు. 42 మ్యాచ్‌లలో కపిల్ 43 వికెట్స్ తీయగా.. జడేజా 30 వన్డేల్లో 44 వికెట్లు తీశాడు. ఇక భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్న దిగ్గజ విండీస్ పేస్ బౌలర్ కోర్ట్నీ వాల్ష్ రికార్డును కూడా జడేజా సమం చేశాడు. వాల్ష్, జడేజా ఖాతాలో చెరో 44 వికెట్లు ఉన్నాయి. మరో రెండు వన్డేలు ఉన్న నేపథ్యంలో జడేడా వాల్ష్ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. వెస్టిండీస్ పర్యటనలో భారత్ ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది.