రఫ్ఫాడించిన జడేజా 12 వికెట్లతో ఫామ్ లోకి
దేశవాళీ క్రికెట్ లో ఈ సారి స్టార్ క్రికెటర్లందరూ సందడి చేస్తున్నారు. ఫామ్ అందుకునేందుకు బరిలోకి దిగిన పలువురు స్టార్ ప్లేయర్స్ లో చాలా వరకూ ఫ్లాప్ అయ్యారు.
దేశవాళీ క్రికెట్ లో ఈ సారి స్టార్ క్రికెటర్లందరూ సందడి చేస్తున్నారు. ఫామ్ అందుకునేందుకు బరిలోకి దిగిన పలువురు స్టార్ ప్లేయర్స్ లో చాలా వరకూ ఫ్లాప్ అయ్యారు. కానీ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం అదరగొట్టాడు. రంజీ మ్యాచ్ తో ఫామ్ లోకి వచ్చేశాడు. 12 వికెట్లతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చాడు. జడేజా సౌరాష్ట్ర తరఫున అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో 12 వికెట్లు పడగొట్టి సౌరాష్ట్రకు ఘన విజయాన్ని అందించాడు. జడేజా ధాటికి ఈ మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు తీసాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ రాణించి 38 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దేశవాళీ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చిన మిగతా ఇంటర్నేషనల్ స్టార్స్ అంతా విఫలమవ్వగా.. జడేజా ఒక్కడే సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున రిషభ్ పంత్ బరిలోకి దిగగా.. రెండు ఇన్నింగ్స్‌ల్లో అతను విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో ధర్మెంద్ర జడేజా బౌలింగ్‌లోనే ఔటవ్వగా.. రెండో ఇన్నింగ్స్‌లో రవీంద్ర జడేజాకు వికెట్ సమర్పించుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌ల్లో ఒక్క పరుగే చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులకే వెనుదిరిగాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు దేశవాళీ క్రికెట్ తో జడ్డూ ఫామ్ లోకి రావడం ఫ్యాన్స్ కు రిలీఫ్ ఇచ్చింది. గత ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత పొట్టి క్రికెట్ కు గుడ్ బై చెప్పిన జడేజా ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో మాత్రమే కొనసాగుతున్నాడు.
అయితే గత కొంతకాలంగా స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా టూర్ లో జడేజా నిరాశపరిచాడు. అటు బ్యాట్ తోనూ ఫెయిలయ్యాడు. దీంతో అతని రిటైర్మెంట్ పైనా చర్చ వచ్చింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి సీనియర్ ఆల్ రౌండర్ కావాలన్న ఉద్దేశంతో సెలక్టర్లు జడ్డూను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో జడేజా ఫామ్ లోకి రావడం టీమిండియా మేనేజ్ మెంట్ కు సంతోషాన్నిచ్చేదే..ఓవరాల్ గా ఫస్ట్ క్లాస్ కెరీర్ లో జడేజా ఇప్పటి వరకూ 7500కు పైగా రన్స్ చేయడంతో పాటు 554 వికెట్లు పడగొట్టాడు.