Bhumra: బుమ్రా రీఎంట్రీపై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక అప్డేట్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీ ఎప్పుడు..? చాలాకాలంగా భారత క్రికెట్ అభిమానులను వేధిస్తున్న ప్రశ్న ఇది. అసలే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ వంటి కీలక టోర్నీలు ముందున్న నేపథ్యంలో హిట్‌మ్యాన్ వచ్చేది ఎప్పుడన్న ప్రశ్నకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
బుమ్రా రీఎంట్రీపై కీలక అప్డేట్ ఇచ్చాడు. గతేడాది జులైలో ఇంగ్లాండ్‌తో టెస్టు, వన్డే సిరీస్ తర్వాత వెన్ను గాయంతో టీమ్‌కు దూరమై తిరిగి సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో ఒక టీ20 మ్యాచ్ ఆడి మళ్లీ గాయం బారిన పడ్డ బుమ్రా.. కీలకమైన టీ20 వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు దూరమయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూజిలాండ్ వెళ్లి ఆపరేషన్ చేయించుకున్న బుమ్రా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రోహిత్ మాట్లాడుతూ..‘బుమ్రా అనుభవం ఎంతో ముఖ్యం. ప్రస్తుతం బుమ్రా చాలా తీవ్రమైన గాయం నుంచి కోలుకుంటున్నాడు.
బుమ్రా త్వరలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్తాడా..? లేదా..? అన్నది నాకు తెలియదు. ఐర్లాండ్‌కు వెళ్లబోయే టీమ్‌ను ఇంకా అనౌన్స్ చేయలేదు కదా. ఒకవేళ బుమ్రా అక్కడికి వెళ్లితే అది మంచిదే. వరల్డ్ కప్‌కు ముందు అతడు కొన్ని మ్యాచ్‌లు ఆడితే టీమ్‌కు కూడా అది లాభించేదే. ఒక సీరియస్ ఇంజ్యూరీ నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చే ఆటగాళ్లకు మ్యాచ్ ఫిట్‌నెస్, మ్యాచ్ ఫీలింగ్ చాలా ముఖ్యం..’అని చెప్పాడు. బుమ్రా ఫిట్‌నెస్, అతడి రికవరీ ఎలా ఉంది..? అన్నదానిపై కూడా హిట్‌మ్యాన్ స్పందించాడు. ‘బుమ్రా కోలుకోవడంపైనే అతడి రీఎంట్రీ ఆధారపడి ఉంది. మేమైతే ఎన్సీఎతో నిత్యం టచ్‌లోనే ఉంటున్నాం. ప్రస్తుతానికైతే బుమ్రా ఫిట్‌నెస్ గురించి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి..’అని తెలిపాడు.