ఇంపాక్ట్ రూల్ ఉంటుందా ? జైషా చెప్పిన సమాధానమిదే
ఐపీఎల్ 18వ సీజన్ లో ప్రతీ జట్టు కాంబినేషన్ మారిపోవడం ఖాయమైంది. మెగా వేలానికి ముందే పలువురు ఆటగాళ్ళను ఫ్రాంచైజీలు వదిలేయనుండగా… మరికొందరు వారంతట వారే వేలంలోకి వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే వచ్చే ఐపీఎల్ లో కొన్ని నిబంధనలకు సంబంధించి ఇటీవలే ఫ్రాంచైజీ ఓనర్లలో బీసీసీఐ సమావేశం నిర్వహించింది. ముఖ్యంగా ఇంపాక్ట్ రూల్ ఉంటుందా లేదా అనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత ఏడాది నుంచే ఇంపాక్ట్ రూల్ ను ఐపీఎల్ లోకి తీసుకొచ్చారు. ఈ రూల్‌తో ఒక ఆటగాడిని జట్టులోకి అదనంగా చేర్చుకుని బౌలింగ్, బ్యాటింగ్‌లో ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్ రౌండర్లకు అన్యాయం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో పలువురు కెప్టెన్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇటీవల బీసీసీఐ నిర్వహించిన మీటింగ్ లోనూ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పైనే ప్రధాన చర్చ జరిగింది. కొన్ని ఫ్రాంచైజీలు దీనికి మద్ధతుగా నిలిస్తే… మరికొన్ని ఫ్రాంచైజీలు వ్యతిరేకించాయి. తాజాగా బీసీసీఐ సెక్రటరీ జైషా ఇంపాక్ట్ రూల్ పై స్పందించారు. కొన్ని ఫ్రాంచైజీలు వ్యతిరేకించిన మాట వాస్తవమేనని చెప్పారు. ఈ నిబంధన ఆల్‌రౌండర్లపై పెనుప్రభావం చూపుతోందని అంగీకరించారు. అయితే ఈ రూల్ తో ఒక భారత ఆటగాడికి జట్టులో చోటు దక్కుతోందన్నది కూడా గమనించాలన్నారు. ఏది ఏమైనప్పటికీ క్రికెట్ కు మంచి చేసే నిబంధనలే ఆటలో ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. ఇంపాక్ట్ రూల్ శాశ్వతం కాదంటూ గతంలో కూడా జైషా చెప్పిన నేపథ్యంలో వచ్చే సీజన్ లో ఉంటుందా లేదా అన్నది మాత్రం మెగా వేలానికి ముందు క్లారిటీ వచ్చే అవకాశముంది.