ఇక బీసీసీఐ చేతుల్లో ఐసీసీ ఛైర్మన్ గా జైషా ఏకగ్రీవ ఎన్నిక

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 27, 2024 | 08:55 PMLast Updated on: Aug 27, 2024 | 8:55 PM

Jay Shah Elected As Unopposed Icc Chairman

అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్యలో బీసీసీఐ ఇక పూర్తిగా ఆధిపత్యం కనబరచబోతోంది. ప్రపంచ క్రికెట్ లో అత్యంత ధనిక బోర్డుగా గుర్తింపు ఉన్న బీసీసీఐకే ఐసీసీ టాప్ పోస్టు దక్కింది. ఐసీసీ బాస్ గా బీసీసీఐ సెక్రటరీ జైషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐసీసీ ప్రస్తుత ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే పదవీకాలం నవంబర్ 30తో ముగుస్తుంది. మరోసారి ఎన్నికల బరిలో నిలవకూడదని అతను నిర్ణయించుకోవడంతో జై షాకు ఆ పదవి దక్కింది. జై షా తప్పిస్తే మరెవరూ పోటీలో నిలవకపోవడం, బీసీసీఐ సెక్రటరీకే అన్ని క్రికెట్ దేశాలు మద్ధతు తెలపడంతో జైషా ఎన్నిక ఏకగ్రీవమైంది. తద్వారా ఐసీసీ ఛైర్మన్ పదవికి ఎంపికైన పిన్నవయస్కుడిగా జైషా రికార్డు సృష్టించారు.

పేరుకు బీసీసీఐ కార్యదర్శి అయినా.. జైషా భారత క్రికెట్‌ను అంతా తానై నడిపిస్తున్నారు. బీసీసీఐ షాడో ప్రెసిడెంట్‌గా.. బాస్‌గా చలామణి అవుతున్నారు. బీసీసీఐ కార్యదర్శిగా జై షాకు మరో ఏడాది పదవీ కాలం ఉంది. ఆ తర్వాత రూల్స్ ప్రకారం మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలి. ఈ క్రమంలోనే ఐసీసీ ఛైర్మన్ పదవి చేపట్టాలని జైషా నిర్ణయించుకున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ క్రికెట్ లో బీసీసీఐ ఆధిపత్యం గురించి అందరికీ తెలిసిందే…ఎన్నో దశాబ్దాల కాలంగా ఐసీసీలో మనదే పైచేయిగా నిలుస్తోంది. వరల్డ్ క్రికెట్ లోనే రిచ్చెస్ట్ క్రికెట్ బోర్డు కావడం, తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడమే దీనికి కారణం. శరద్ పవార్, జగన్మోహన్ దాల్మియా వంటి వాళ్ళు ఐసీసీలో చక్రం తిప్పారు. తాజాగా మరోసారి అటువంటి అరుదైన అవకాశం బీసీసీఐకే రావడంతో క్రికెట్ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.