Jio Cinema: జియో సినిమాాలోనే క్రికెట్.. ఐదేళ్లపాటు హక్కులు దక్కించుకున్న సంస్థ..!
ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని వయాకామ్ 18.. తాజాగా స్వదేశంలో వచ్చే ఐదేండ్లకు గాను టీమిండియా ఆడబోయే ద్వైపాక్షిక మ్యాచ్‌ల ప్రసార హక్కులనూ సొంతం చేసుకుంది. భారత క్రికెట్ ప్రసార హక్కులపై గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తూ.. రూ.5,963 కోట్లకు దక్కించుకుంది.
Jio Cinema: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు బంగారు బాతుగుడ్డుగా మారిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో డిజిటల్ రైట్స్‌తో పాటు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రసార హక్కులనూ దక్కించుకున్న ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని వయాకామ్ 18.. తాజాగా స్వదేశంలో వచ్చే ఐదేండ్లకు గాను టీమిండియా ఆడబోయే ద్వైపాక్షిక మ్యాచ్‌ల ప్రసార హక్కులనూ సొంతం చేసుకుంది. భారత క్రికెట్ ప్రసార హక్కులపై గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తూ.. రూ.5,963 కోట్లకు దక్కించుకుంది.
భారత క్రీడా రంగంలో డిస్నీ హాట్ స్టార్‌తో పాటు, సోనీ సంస్థను కనుమరుగు చేసి ప్రసార హక్కులను తన గుప్పిట బంధించింది. గురువారం ముగిసిన బీసీసీఐ మీడియా రైట్స్ ఈ వేలంలో భారత్.. తదుపరి ఐదేండ్ల వరకూ, అంటే 2028 వరకు స్వదేశంలో ఆడబోయే మ్యాచ్‌ల డిజిటల్, టీవీ ప్రసారాలను వయాకామ్ దక్కించుకుంది. ఈ వేలంలో హాట్ స్టార్, సోనీ పోటీపడ్డా వయాకామ్ దెబ్బకు అవి నిలువలేకపోయాయి. డిజిటల్ రైట్స్‌ను రూ.3,101 కోట్లకు దక్కించుకున్న అంబానీ సంస్థ.. టీవీ హక్కులకు రూ.2,862 కోట్లకు దక్కించుకుంది. మొత్తంగా రూ.5,963 కోట్లు చెల్లించింది. ఈ ఐదేండ్ల కాలంలో భారత్.. స్వదేశంలో 25 టెస్టులు, 27 వన్డేలు, 36 టీ20లు ఆడనుంది.
ఇందులో అగ్రశ్రేణి జట్టు అయిన ఆస్ట్రేలియాతో 21 మ్యాచ్‌లు, ఇంగ్లాండ్‌తో 18, న్యూజిలాండ్‌తో 11, సౌతాఫ్రికాతో 10, వెస్టిండీస్‌తో 10, అఫ్గానిస్తాన్‌తో ఏడు, శ్రీలంకతో ఆరు, బంగ్లాదేశ్‌తో ఐదు మ్యాచ్‌లలో తలపడనుంది. ఈ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్ డిజిటల్ హక్కులూ వయాకామ్ వద్దే ఉన్నాయి. గతేడాది ముగిసిన ఈ వేలంలో వయాకామ్.. ఏకంగా రూ.26 వేల కోట్లు చెల్లించి ఐపీఎల్ డిజిటల్ హక్కులు దక్కించుకున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడబోయే వన్డే సిరీస్‌తో ఈ ఒప్పందం మొదలుకానుంది.