Joe Root: సచిన్, కోహ్లీలను మించినా కూడా జయవర్ధనే రికార్డును అందుకోలేకపోయాడు
ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలకడైన ఆటగాడిగా మంచి గుర్తింపు పొందాడు. తన ఆటతో ప్రత్యర్థి బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతాడు. సామాన్యంగా అతన్ని ఔట్ చేయాలంటే.. బౌలర్లు శ్రమించాల్సిన పరిస్థితి ఉంటుంది.
అయితే తాజాగా జరుగుతున్న యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ మ్యాచ్ లో.. తొలి ఇన్నింగ్స్ లో జో రూట్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దాంతో ఇంగ్లాండ్ 393 స్కోరు చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో జో రూట్ 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అయితే ఆసీస్ బౌలర్ నాథన్ లియోన్ స్పిన్ మాయజాలానికి రూట్ స్టంపౌట్ అయ్యాడు. అయితే జో రూట్ స్టంపౌట్ అవ్వడం ద్వారా రికార్డ్ నెలకొల్పాడు.
కెరీర్ లో 130 టెస్టులు ఆడిన రూట్ స్టంపౌట్ అవ్వడం ఇదే తొలిసారి. దాంతో కెరీర్ లో 11,168 రన్స్ చేసిన తర్వాత స్టంపౌట్ అయిన రెండో ఆటగాడిగా నిలిచాడు రూట్. ఇక తొలి స్థానంలో విండీస్ దిగ్గజం చంద్రపాల్ 11,414 పరుగులతో ఉన్నాడు. మూడో స్థానంలో గ్రేమ్ స్మిత్ 8800 పరుగులతో ఉండగా.. టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ 8195, సచిన్ 7419 పరుగులు చేసిన తర్వాత స్టంపౌట్ అయ్యి నాలుగు, ఐదు ప్లేసుల్లో నిలిచారు. ఇక టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసి ఒక్కసారి కూడా స్టంపౌట్ కాని ఆటగాడిగా శ్రీలంక ఆటగాడు మహేల జయవర్దనే నిలిచాడు. అతడు టెస్టుల్లో 11,814 రన్స్ చేసి ఒక్కసారి కూడా స్టంపౌట్ కాకపోవడం విశేషం.